9 మంది ఫేక్​ నక్సల్స్ అరెస్టు

9 మంది ఫేక్​ నక్సల్స్ అరెస్టు
  • 5 డమ్మీ, నాటు తుపాకులు, కారు, స్కూటీ స్వాధీనం 

బెల్లంపల్లి, వెలుగు: తుపాకులు పట్టుకుని మావోయిస్టులం అంటూ బెదిరింపులకు పాల్పడుతూ పైసలు వసూలు చేస్తున్న 9 మందిని బెల్లంపల్లి పోలీసులు అరెస్టు చేశారు. రామగుండం సీపీ చంద్రశేఖర్​రెడ్డి శుక్రవారం బెల్లంపల్లిలో ప్రెస్​మీట్ పెట్టి వివరాలు వెల్లడించారు. వరంగల్ జిల్లా నడికుడ గ్రామానికి చెందిన తేలుకుంట్ల భిక్షపతి మాజీ నక్సలైట్. మావోయిస్టుల పేరుతో బెదిరించి అక్రమంగా డబ్బు సంపాదించాలని స్కెచ్​ వేశాడు. హైదరాబాద్​లోని రామంతాపూర్​కు చెందిన వడ్లకొండ రాజ్​కుమార్, యూసుఫ్​గూడకు చెందిన మహ్మద్ మతీన్అలీ, బోరబండకు చెందిన మోటమర్రి ప్రదీప్ కుమార్, రాంనగర్​కు చెందిన మహ్మద్ ఇమ్రాన్​ఖాన్, వరంగల్ జిల్లా నేరెడ్​మెట్​కు చెందిన రాగుల రాజశేఖర్, దేశాయిపేటకు చెందిన మహ్మద్ అఫ్జల్, వరంగల్​లోని ఎల్బీనగర్​కు చెందిన పుతిన్ భారతి(శంబుభారతి),  మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం తిమ్మాపూర్​కు చెందిన తుంగ క్రాంతికుమార్​తో టీమ్​ఏర్పాటు చేశాడు. సెప్టెంబర్​లో మంచిర్యాలకు చెందిన దాసరి అంజిబాబు అనే వ్యక్తిని కిడ్నాప్​ చేసి రూ.30లక్షలు డిమాండ్​ చేశారు. తామంతా మవోయిస్టు గణేశ్​దళ సభ్యులమని డమ్మీ తుపాకులతో బెదిరించారు. భయపడిపోయిన అంజిబాబు మొదట రూ.1.50 లక్షలు, తర్వాత రూ.లక్ష ఇవ్వడంతో విడిచిపెట్టారు. ఇటీవల మళ్లీ ఫోన్లు చేసి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ ​చేయడంతో అంజిబాబు ఈ నెల 16న బెల్లంపల్లి మండలంలోని తాళ్లగురిజాల పోలీసులకు కంప్లైంట్​ చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలోని టీ- జంక్షన్​లో భిక్షపతిని, అతని సమాచారంతో మరో ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ఇద్దరు పరారీలో ఉన్నారు. ప్రధాన నిందితుడు భిక్షపతిపై పరకాల, హనుమకొండ, మట్టెవాడ, ఎల్కతుర్తి, కాకతీయ యూనివర్సిటీ, ఇంతేజార్​గంజ్​, కేశవపట్నం, కొత్తపల్లి, మానకొండూరు, ధర్మసాగర్, మడికొండ  పీఎస్​లలో13 కేసులు ఉన్నాయని సీపీ  వివరించారు. 2016లో కరీంనగర్​లో, 2019లో వరంగల్ పోలీసులు అతనిపై పీడీ యాక్ట్ ప్రయోగించారని వెల్లడించారు. నిందితుల నుంచి రెండు కంట్రీమేడ్ పిస్టల్స్, ఒక 7.65 ఎంఎం లైవ్ రౌండ్స్, ఖాళీ రౌండ్ కేస్, రెండు డమ్మీ పిస్టల్స్, డమ్మీ రివాల్వర్, కారు, బైక్, రెండు కత్తులు, రెండు వాకీటాకీలు, రెండు బ్యాటరీలు, మావోయిస్ట్ పార్టీ పేరుతో ఉన్న లెటర్​ప్యాడ్, ఏడు ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.