అవును నిజమే : తొమ్మిది నిమ్మకాయలు.. రూ. 2 లక్షల 30 వేలు

అవును నిజమే : తొమ్మిది నిమ్మకాయలు.. రూ. 2 లక్షల 30 వేలు

నిమ్మకాయ ధర ఎంత ఉంటుంది.. ఒక్కో నిమ్మకాయ.. మహా అయితే 5 రూపాయలు లేదా 10 రూపాయలు.. అన్ సీజన్ అయితే 2, 3 మూడు రూపాయలే.. అక్కడ మాత్రం తొమ్మిది నిమ్మకాయలు అక్షరాల 2 లక్షల 30 వేల రూపాయలు పలికాయి.. అంటే ఒక్కో నిమ్మకాయ అక్షరాల 25 వేల రూపాయలు.. ఇంత ధర పలికిన నిమ్మకాయల్లో ప్రత్యేకత ఏంటీ.. ఎందుకు ఇంత ధర పలికింది అనేది చూద్దాం... వినటానికే షాకింగ్ గా ఉన్న ధర పలికిన నిమ్మకాయలు తమిళనాడు రాష్ట్రంలోని విల్లుపురంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి చెందినవి.

ఈ గుడిలోని స్వామివారి శూలానికి గుచ్చిన నిమ్మకాయల వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రజలు నమ్ముతారు. ప్రతి ఏటా స్వామి వారి ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలు జరిగినన్ని రోజులు పూజారులు స్వామివారి శూలానికి రోజుకొక నిమ్మకాయను గుచ్చి పూజలు నిర్వహిస్తారు.అలా పూజించిన నిమ్మకాయలు ఉత్సవాలు ముగించే రోజున ఆలయ కమిటీ వేలం వేస్తుంది. అలా జరిగిన వేలంలో ఈ ఏడాది 9 నిమ్మకాయలు 2.3 లక్షల రూపాయల ధర పలికాయని ఆలయ సిబ్బంది తెలిపింది. అంతే కాకుండా ఈ ఉత్సవాల మొదటి రోజు పూజకు వాడే నిమ్మకాయకు ప్రత్యేక శక్తి ఉంటుందని భక్తులు నమ్ముతారు. ఈ ఏడాది ఆ నిమ్మకాయను కులతూర్ గ్రామానికి చెందిన దంపతులు  50,500 రూపాయలు పెట్టి సొంతం చేసుకున్నట్లు తెలిపారు ఆలయ సిబ్బంది.