విమానం కూలి 9 మంది మృతి

విమానం కూలి 9 మంది మృతి

ఖార్తూమ్: సూడాన్‌లోని పోర్ట్‌ సూడాన్‌ ఎయిర్‌పోర్టులో టేకాఫ్‌ అవుతుండగా ఓ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయినవారిలో నలుగురు జవాన్లు కూడా ఉన్నారని సూడాన్‌ మిలటరీ వెల్లడించింది. ఒక చిన్నారి ప్రాణాలతో బయటపడిందని తెలిపింది. టెక్నికల్ ఇష్యూ తలెత్తడంతోనే ప్రమాదం జరిగిందని అధికారులు వివరించారు. కాగా.. సూడాన్ సైన్యం, పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్‌(ఆర్ఎస్ఎఫ్)ల మధ్య ఏప్రిల్​లో మొదలైన అంతర్యుద్ధం ఆదివారం 100వ రోజుకు చేరుకుంది. ఈ యుద్ధంలో 3 వేల మందికి పైగా మరణించారని అధికారులు వెల్లడించారు. మరో 6 వేల మందికి పైగా గాయపడ్డారని చెప్పారు. సుడాన్‌ జన జీవనం అస్తవ్యస్తం అయిపోయిందని వివరించారు. సుమారు 2.6 మిలియన్లకు పైగా ప్రజలు తమ సొంత ఇండ్లను వదిలి సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకున్నారని..చాలామంది పొరుగు దేశాలకు పారిపోయారని తెలిపారు. 

ఇండోనేషియాలో బోటు బోల్తా పడి..

జకార్తా: ఇండోనేషియాలోని సులవేసి ఐలాండ్ వద్ద ఓవర్ లోడ్ తో వెళ్తున్న బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది చనిపోయారు. మరో19 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బోటు ఆగ్నేయ సులవేసి ప్రావిన్స్ లోని సులవేసిలోని సెంట్రల్ బటన్‌కు బయలుదేరిందని అధికారులు వెల్లడించారు. సోమవారం తెల్లవారుజామున ఐలాండ్ వద్ద సముద్రంలో మునిగిందని చెప్పారు. సమాచారం అందగానే ఇండోనేషియా నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ ఘటనాస్థలానికి చేరుకుని ఆరుగురిని కాపాడినట్లు తెలిపారు. ప్రమాదంలో 15 మంది చనిపోయారని..19 మంది గల్లంతయ్యారని చెప్పారు. 20 మంది ప్రయాణం చేసే కెపాసిటీ ఉన్న బోటులో 40 మంది ప్రయాణించడం వల్లే ప్రమాదం జరిగిందని వెల్లడించారు.