
బల్గేరియాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 9 మంది చనిపోయారు. తూర్పు బల్గేరియాలోని రోయార్ గ్రామంలో సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఓ పాత పాఠశాల భవనంలో మంటలు చెలరేగాయి. ఆ మంటలు క్రమంగా పక్కనే ఉన్న నర్సింగ్‌హోమ్ కు వ్యాపించాయి. దాంతో నర్సింగ్‌హోమ్‌లో ఉన్న 9 మంది వృద్ధులు మరణించారని అగ్నిమాపక శాఖ చీఫ్ తిహోమిర్ టోటెవ్ తెలిపారు. ఆరు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చామని ఆయన చెప్పారు. అగ్నిప్రమాద సమయంలో నర్సింగ్‌హోమ్‌లో 58 మంది ఉన్నారని.. వారిలో చాలామందికి శ్వాస సమస్య వచ్చిందని ఆయన తెలిపారు. వెంటనే అప్రమత్తమైన కేర్ సిబ్బంది.. తమకు సమాచారమివ్వడంతో ఘటనాస్థలానికి చేరుకొని.. అందరినీ బయటకు తీసుకొచ్చామని ఆయన చెప్పారు. శ్వాస సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు కేర్ డైరెక్టర్ మిలెనా మజురిక్ తెలిపారు. ఈ నెలలోనే స్లివెన్‌లోని కరోనావైరస్ వార్డులో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు రోగులు మరణించడం గమనార్హం.