కూతురిని చంపి.. ఇన్సూరెన్స్ డబ్బులతో ఈఎమ్ఐలు

కూతురిని చంపి.. ఇన్సూరెన్స్ డబ్బులతో ఈఎమ్ఐలు
  • ఈఎమ్ఐలు కట్టడం కోసం.. కూతురిని చంపిన తల్లి
  • రెండో భర్తతో కలిసి దారుణం
  • పంజాబ్‌లోని లుధియానాలో ఘటన

పంజాబ్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. ఈఎమ్ఐలు కట్టడం కోసం కన్నకూతురినే చంపింది ఓ తల్లి. ఈ అమానుష ఘటన లుధియానాలో జరిగింది. స్థానికంగా నివసించే పింకీ (27) అనే మహిళ తన భర్తతో విడిపోయి.. నరీందర్‌పాల్ (31) అనే వ్యక్తిని మూడెండ్ల కింద పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత పింకీ ఒక బాబుకు జన్మనిచ్చింది. పింకీ ప్రస్తుతం తన కూతురు భారతి (9), కొడుకు, నరీందర్‌పాల్‌తో కలిసి నివసిస్తోంది. ఈ జంట 2018లో భారతి కోసం రూ .2.5 లక్షల జీవిత బీమా పాలసీని కొనుగోలు చేసింది. అనంతరం పింకీ, నరీందర్‌పాల్‌ దంపతులు 2019లో మూడు లక్షల రూపాయలకు ఓ ప్లాట్ కొన్నారు. అప్పటి నుంచి ఆ మొత్తాన్ని ఈఎమ్ఐల రూపంలో చెల్లిస్తున్నారు. ఈఎమ్ఐల కింద ఇప్పటికే రూ. 1.49 లక్షలు చెల్లించారు. అయితే లాక్‌డౌన్ వల్ల ఉపాధి సరిగా లేకపోవడంతో.. ఈఎమ్ఐలు చెల్లించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాంతో భారతిని చంపి.. ఆమె పేరు మీద వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులతో ఈఎమ్ఐలు కట్టాలని నీచంగా ఆలోచించారు. 

ఈ క్రమంలో దంపతులిద్దరూ భారతిని జూన్ 19న రాత్రి సమయంలో హంబ్రాన్‌లోని పశువుల మేత కర్మాగారానికి తీసుకెళ్లి హత్యచేశారు. పింకీ దుపట్టాను భారతి మెడకు బిగించి ఇద్దరూ కలిసి అంతమొందించారు. అనంతరం మరుసటి రోజు ఉదయం పాప అపస్మారకస్థితిలో ఉందని సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి.. బాలిక చనిపోయిందని తేల్చారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇరుగుపొరుగువారిని దర్యాప్తు చేశారు. భారతిని నరీందర్‌పాల్ ఇష్టపడేవాడు కాదని.. తరచుగా కొట్టేవాడని తెలిపారు. పింకీ మరియు నరీందర్‌పాల్ మొదట పాప సహజంగానే చనిపోయిందని పోలీసులకు తెలిపారు. కానీ, పోస్ట్‌మార్టం నివేదికలో గొంతు పిసికినట్లు నిర్ధారణ అయింది. దాంతో పోలీసులు.. నరీందర్‌పాల్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా.. అసలు విషయం బయడపడింది. తమ ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించుకోవడం కోసమే పాపను చంపినట్లు నిందితులిద్దరూ అంగీకరించారు. ప్రస్తుతం దంపతులిద్దరూ పోలీసుల అదుపులో ఉన్నారు. వారిద్దరిపై ఐపీసీ సెక్షన్ 302, 120-బి, 182, 34 కింద కేసులు నమోదు చేశారు.