- ఐడీఏ బొల్లారం పీఎస్ఎన్ మెడికేర్ ఫ్యాక్టరీలో తనిఖీలు
- పట్టుబడిన రూ.9 కోట్ల సరుకు
- సిగరెట్లలో నింపి విదేశాలకు రవాణా చేస్తున్నట్టు గుర్తింపు
సంగారెడ్డి, వెలుగు : హైదరాబాద్ శివారులోని ఐడీఏ బొల్లారంలో భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడడం కలకలం రేపింది. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడీఏ బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియా పీఎస్ఎన్ మెడికేర్ ఫ్యాక్టరీలో శుక్రవారం పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. బొల్లారం ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారు చేస్తున్నట్లుగా ఇంటర్ పోల్ ఇచ్చిన సమాచారంతో డ్రగ్ కంట్రోల్ అధికారులు మెడికేర్ ఫ్యాక్టరీపై దాడులు చేశారు. ఈ సందర్భంగా దాదాపు రూ.9 కోట్ల విలువ చేసే 90 కిలోల మెపిడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పదేండ్లుగా ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారు చేసి విదేశాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ వ్యవహారానికి సూత్రధారి ఫ్యాక్టరీ ఓనర్ నల్లపొడి కస్తూరిరెడ్డి డ్రగ్ కంట్రోల్ అధికారులు అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు. సిగరెట్ ప్యాకెట్లలో ఈ డ్రగ్‌ను పెట్టి విదేశాలకు తరలిస్తున్నట్లు తేల్చారు. కాగా, ఇదే ఫ్యాక్టరీ నుంచి కొంతవరకు హైదరాబాద్ నగరంలో కూడా సప్లయ్చేసినట్లు అనుమానిస్తున్నారు.
