పుంజుకుంటున్న ఆయిల్ పామ్

పుంజుకుంటున్న ఆయిల్ పామ్
  • ఆడ గెలలతోనే.. ఇన్​కమ్​
  • నాలుగేండ్లలో ఒక్కో ఎకరాకు..
  • రూ. 50 వేలు సబ్సిడీ, నగదు సాయం 
  • సమగ్ర నీటి యాజమాన్యంతోనే మంచి దిగుబడి
  • యాదాద్రిలో 4888 ఎకరాల్లో సాగు

యాదాద్రి, వెలుగు రైతులకు దీర్ఘకాలికంగా ఇన్​కమ్​ అందించే ఆయిల్‌‌పామ్‌‌పంట సాగు, విస్తీర్ణం పెంపుపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఏటా కొంత మొత్తం సాయం అందిస్తోంది. మద్దతు ధర ప్రతి ఏడాది సవరిస్తున్నారు. దీంతో రైతులు కూడా ఆయిల్​పామ్​పై ఆసక్తి చూపుతున్నారు. దీంతో జిల్లాలో సాగు విస్తీర్ణం పెరుగుతోంది. అయితే ఈ పంట సాగులో ఆడగెలలతోనే రైతులకు ఇన్​కమ్​ వస్తుంది. 

రైతులు దశబ్దాల తరబడి సంప్రదాయ పంటలైన వరి, పత్తి సహా మరికొన్ని పంటలే ఎక్కువగా పండిస్తున్నారు. పంటల మార్పిడి విషయాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో రైతులకు దీర్ఘకాలికంగా ఇన్​కం వచ్చే ఆయిల్‌‌పామ్‌‌సాగును ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. ఎక్కువగా సంప్రదాయ పంటలపై రైతులు ఆసక్తి చూపుతున్నందున ఆయిల్​పామ్​ను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటోంది. 

ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహకాలు

నగదు, సబ్సిడీ కలుపుకొని ఎకరాకు రూ. 50,918  ఆయిల్​పామ్​ సాగు ప్రోత్సహకాల్లో  భాగంగా సబ్సిడీతో పాటు రైతులకు నగదు సాయం అందిస్తోంది. ఆయిల్​పామ్​ నుంచి ఇన్​కం రావాలంటే నాలుగేండ్లు సమయం పడుతోంది. అందుకే ఒక్కో ఎకరానికి రూ. 4200 చొప్పున ప్రోత్సాహకం అందిస్తోంది. 

ఆడ గెలలతోనే ఇన్​కమ్​

ఆయిల్​పామ్​ మొక్కలకు ఆడ, మగ పువ్వులు పూస్తాయి. మగ పువ్వుల కారణంగా ప్రయోజనం ఉండదు. ఆడ పువ్వులు పలధీకరణ చెంది గెలులుగా రూపాంతరం చెంది, దిగుబడి పెంచుతాయి. నీటి యాజమాన్యం సమర్ధవంతంగా అమలు చేయనట్టయితే మగ పువ్వులే ఎక్కువగా పూసి గెలలుగా మారడంతో పాటు ఆడ గెలలు పెరగకుండా నష్టం చేకూరుస్తాయి.  

ఈ ఏడాది నుంచే దిగుబడి

జిల్లాలో ఈ ఏడాది నుంచే ఆయిల్​పామ్​ దిగుబడి మొదలైంది. జిల్లాలోని 150 ఎకరాల్లో మొక్కల నుంచి గెలలను వేరు చేస్తున్నారు. వీటిని సిద్దిపేట జిల్లాలోని ఆయిల్​పామ్​ గెలలను క్రష్​ చేసే ఫ్యాక్టరీకి తరలిస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ గంటకు 90 టన్నుల నుంచి 120 టన్నుల గెలలను క్రష్​ చేస్తుంది. దీంతో రైతులకు అన్​లోడ్​ గురించి వెయిట్​ చేయాల్సిన అవసరం పెద్దగా ఉండదు. 

నాలుగేండ్ల తర్వాత దిగుబడి​

ఆయిల్​పామ్​ సాగు చేస్తున్న రైతులకు నాలుగేండ్ల తర్వాత ఇన్​కం రావడం మొదలవుతుంది. సాగులో నీటి యాజమాన్యం సక్రమంగా నిర్వహిస్తే ఎకరానికి కనీసం 10 నుంచి 12  టన్నుల దిగుబడి వస్తుంది. సక్రమంగా నిర్వహించకుంటే మగగెలలు పెరిగి 6 టన్నుల నుంచి 8 టన్నుల దిగుబడికే  పరిమితమవుతుంది. అయితే ఆయిల్​పామ్​ మద్దతు ధర నిత్యం పెరుగుతోంది. ప్రస్తుతం టన్ను గెలలకు రూ. 19,681గా ఉంది. ఈ రేటు తరచూ పెరుగుతూనే ఉంటోంది   . దీనివల్ల రైతులకు లాభమే తప్ప నష్టం వచ్చే అవకాశాలు చాలా తక్కువ. 

రైతులు ముందుకు రావాలి: ఆయిల్​పామ్​ సాగు చేయడానికి రైతులు ముందుకు రావాలి. ప్రభుత్వం ప్రోత్సాహకంగా ఎకరాకు రూ. 4200 ఇస్తోంది. నాలుగేండ్ల తర్వాత ఈ సాగుతో దీర్ఘకాలికంగా ఇన్​కమ్​ లభిస్తుంది. కోతుల బెడద అసలే ఉండదు. మద్దతు  ధర ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది.  మాధవి, హార్టికల్చర్​ ఆఫీసర్​, యాదాద్రి