ఆరు నెలల్లో మెగా డీఎస్సీ... 10 వేల టీచర్ పోస్టులు ఖాళీ

ఆరు నెలల్లో మెగా డీఎస్సీ... 10 వేల టీచర్ పోస్టులు ఖాళీ
  • సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చే యోచన

హైదరాబాద్, వెలుగు: టీచర్ పోస్టుల భర్తీపై రాష్ట్ర సర్కారు దృష్టి సారించింది. ఆరు నెలల్లో మెగా డీఎస్సీ వేస్తామని ప్రకటించిన నేపథ్యంలో, ఈ మేరకు విద్యాశాఖ అధికారులు పనులు ప్రారంభించారు. ఇప్పటికే 5,089 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో, ఈ నోటిఫికేషన్​కు మరిన్ని పోస్టులు కలుపుతూ సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలున్నాయి. రాష్ట్రంలోని 26 వేల సర్కారు బడుల్లో 9,370 వరకు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గత ప్రభుత్వం కొన్ని పోస్టులను ఖాళీగా చూపకుండా కేవలం 5,089 పోస్టులతోనే డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దాదాపు ఐదేండ్ల తర్వాత వేసిన నోటిఫికేషన్ కూడా తక్కువ పోస్టులతో వేయడంపై నిరుద్యోగుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. 

తాము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ వేస్తామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్​ పార్టీ హామీ ఇచ్చింది. తాజాగా అసెంబ్లీలోనూ గవర్నర్ ప్రసంగంలోనూ ఈ విషయాన్ని పొందుపర్చారు. రాష్ట్రంలో 9,370 టీచర్ పోస్టులుండగా, ఇటీవల జరిగిన హెడ్​మాస్టర్ల ప్రమోషన్లతో మరో 500 పోస్టుల వరకు ఖాళీ అయ్యాయి. దీంతో మొత్తం సుమారు 10 వేల వరకు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే, ప్రత్యేక అవసరాల పిల్లల కోసం బడుల్లో  స్పెషల్ ఎడ్యుకేటర్స్ నియమించేందుకు 1,523 పోస్టులు ఉన్నట్టు గత ప్రభుత్వం ప్రకటించింది. వీటికి ప్రస్తుత గవర్నమెంట్ స్పెషల్ డీఎస్సీ వేయాలని యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.