రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు 9,494 కోట్లు ఖర్చు చేసినం

రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు 9,494 కోట్లు ఖర్చు చేసినం
  • సికింద్రాబాద్ స్టేషన్‌ను 653 కోట్లతో పునర్నిర్మిస్తున్నం
  • మెదక్ ‑ అక్కన్నపేట కొత్త రైల్వే లైన్ ప్రారంభం
  • కాచిగూడ ట్రైన్‌కు పచ్చజెండా ఊపిన కేంద్ర మంత్రి

మెదక్, మెదక్ టౌన్, వెలుగు: రాష్ట్రంలో ఎనిమిదేండ్లలో రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం రూ.9,494 కోట్లు ఖర్చు చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం.. రాష్ట్రంలో రైల్వే సదుపాయాల కల్పనకు, వసతుల మెరుగుదలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని తెలిపారు. 8 ఏండ్లలో రాష్ట్రంలో 12 కొత్త రైల్వే ప్రాజెక్టులు చేపట్టి, 298 కిలోమీటర్ల దూరం రైల్వే లైన్లను నిర్మించామని వెల్లడించారు. డబ్లింగ్, ట్రిప్లింగ్‌‌లో భాగంగా 221 కిలోమీటర్ల రైల్వే లైన్లను ఆధునీకరించామని, 1,149 కిలోమీటర్ల మేర ఎలక్ట్రిఫికేషన్ పూర్తి చేశామని వివరించారు. మెదక్– అక్కన్నపేట మధ్య కొత్తగా నిర్మించిన బ్రాడ్ గేజ్ రైల్వే లైన్‌‌ను శుక్రవారం ఆయన జాతికి అంకితం చేశారు. మెదక్ రైల్వే స్టేషన్‌‌ను ప్రారంభించి టికెట్ కొనుగోలు చేశారు. జెండా ఊపి మెదక్​ - కాచిగూడ రైల్‌‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేంద్ర మంత్రి కిషన్‌‌రెడ్డి మాట్లాడారు. నిజాం కాలంలో నిర్మించిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌‌ను రూ.653 కోట్లతో ఎయిర్‌‌‌‌పోర్టు తరహాలో పునర్నిర్మించేందుకు చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే రైలు ప్రయాణికులు హైదరాబాద్‌‌లో ట్రాఫిక్‌‌తో చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్య పరిష్కారం కోసం చర్లపల్లిలో రూ.221 కోట్లతో రైల్వే టర్మినల్ నిర్మిస్తున్నామని తెలిపారు. ఇది పూర్తయితే మెదక్, సిద్దిపేట, మేడ్చల్ జిల్లాలతోపాటు, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలకు  వారికి ఇబ్బందులు ఉండవన్నారు.

వరంగల్‌‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ

వరంగల్​లో రూ.400 కోట్లతో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు త్వరలో మొదలు పెట్టనున్నట్టు కిషన్‌‌రెడ్డి వెల్లడించారు. దీంతో 3 వేల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. సికింద్రాబాద్​ - మహబూబ్​నగర్ మధ్య డబ్లింగ్ పనులు చేపట్టేందుకు రూ.774 కోట్లు ఇచ్చామని, మునీరాబాద్​ - మహబూబ్ నగర్ మధ్య రూ.1,723 కోట్లతో 248 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే ప్రాజెక్ట్​ చేపడుతున్నామని తెలిపారు. మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ నుంచి సిరిసిల్ల జిల్లాలోని కొత్తపల్లి వరకు 150 కిలోమీటర్ల దూరం చేపట్టిన కొత్త రైల్వే లైన్​ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 43 రైల్వే స్టేషన్లలో కవచ్ సిస్టం అందుబాటులోకి తెచ్చినట్టు వెల్లడించారు. రైల్వే స్టేషన్లలో ఫ్రీ వైఫై కల్పిస్తున్నామని చెప్పారు.

నేషనల్ హైవేలకు లక్ష కోట్లు

రాష్ట్రంలో నేషనల్ హైవేల అభివృద్ధికి కేంద్రం రూ.ఒక లక్షా నాలుగు వేల కోట్లు ఖర్చు చేస్తున్నదని కిషన్‌‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నుంచి నర్సాపూర్ మీదుగా మెదక్ వరకు హైవే నిర్మాణం పూర్తికాగా, మెదక్ నుంచి రామాయంపేట మీదుగా సిద్దిపేట వరకు మరో హైవే నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. భద్రాచలం అభివృద్ధికి చర్యలు చేపట్టామని, రామప్ప అభివృద్ధికి రూ.60 కోట్లు ఇచ్చామని, జోగుళాంబ ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేశామని వెల్లడించారు.

సంతోషంగా ఉంది: కొత్త ప్రభాకర్‌‌‌‌రెడ్డి

అక్కన్నపేట, మెదక్​ రైల్వే లైన్ తన హయాంలో పూర్తవడం సంతోషకరమని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్​ రెడ్డి అన్నారు. రైలు సదుపాయం కావాలన్న మెదక్ ప్రాంత వాసుల కల తీరిందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. 

టీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీ నినాదాలు

మెదక్​ - అక్కన్నపేట రైల్వే లైన్ ప్రారంభోత్సవం సందర్భంగా టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేశారు. రైల్వే లైన్‌‌ను ప్రారంభించేందుకు స్టేషన్‌‌లోకి కిషన్ రెడ్డి రాగానే.. టీఆర్ఎస్ కార్యకర్తలు జై తెలంగాణ, జై కేసీఆర్, జై పద్మక్క అంటూ పెద్ద పెట్టున స్లోగన్స్ ఇచ్చారు. పోలీసులు ఎంత నచ్చజెప్పినా వారు వినిపించుకోలేదు. ఈ క్రమంలో ప్రతిగా బీజేపీ కార్యకర్తలు భారత్‌‌మాతాకీ జై, వందేమాతరం, జై నరేంద్ర మోడీ అంటూ నినదించారు. దీంతో కొద్దిసేపు రైల్వే స్టేషన్ ప్రాంగణం దద్దరిల్లింది. సభా వేదికపై మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగించే సమయంలో కూడా రెండు పార్టీల కార్యకర్తలు నినాదాలు చేశారు.