9 పోస్టులు..984 అప్లికేషన్లు

9 పోస్టులు..984 అప్లికేషన్లు

హైదరాబాద్‌, వెలుగు:  రాష్ట్రంలో యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ పోస్టులకు ఫుల్‌ డిమాండ్‌ కనిపిస్తోంది. ఖాళీగా ఉన్న 9 వీసీ పోస్టులకు ఏకంగా 984 దరఖాస్తులొచ్చాయి. అత్యధికంగా అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీకి 142 మంది అప్లై చేశారు. కులాల వారీగా వీసీలను నియమించేందుకు ఇప్పటికే సర్కారు చర్యలు మొదలుపెట్టినట్టు తెలిసింది. దసరా తర్వాత సెర్చ్‌ కమిటీల సమావేశాలు ప్రారంభమవ్వొచ్చని అధికారులు చెబుతున్నారు.

వారం క్రితం సెర్చ్‌ కమిటీలు

రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ, జేఎన్‌టీయూ, పొట్టి శ్రీరాములు తెలుగు, అంబేద్కర్‌ ఓపెన్‌ వర్సిటీల్లోని వీసీల పదవీకాలం ఆగస్టు 24తో ముగుస్తుండటంతో ఆగస్టు 23న ప్రభుత్వం ఆ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది. 273 మంది ప్రొఫెసర్లు అప్లై చేసుకున్నారు. దరఖాస్తులను పరిశీలించి వెంటనే సెర్చ్‌ కమిటీలు వేయాల్సిన ప్రభుత్వం జాప్యం చేసింది. పార్టీలు, స్డూడెంట్లు, విద్యావేత్తల నుంచి విమర్శలు పెరగడంతో వారం క్రితం 9 వర్సిటీలకు సెర్చ్‌ కమిటీలను నియమించింది. సర్కారు నామినీగా సీనియర్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ సోమేశ్‌కుమార్‌ను పెట్టింది. యూజీసీ నామినీ సభ్యులు కొందరు సెంట్రల్‌ వర్సిటీల వీసీలు, ప్రొఫెసర్లుగా ఉండటంతో వారి టైమ్‌ తీసుకోవాల్సి ఉంది. కాబట్టి దసరా తర్వాతే కొన్ని వర్సిటీల సెర్చ్‌ కమిటీలు సమావేశమయ్యే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికీ దరఖాస్తుల పరిశీలన పూర్తి కాలేదని తెలుస్తోంది. ప్రక్రియంతా గుట్టుగా జరుగుతుండటం అనుమానాలకు తావిస్తోంది.

ఓయూ వీసీ పోస్టుకు 114

బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ వీసీ పోస్టుకు అత్యధికంగా 142 దరఖాస్తులు రాగా పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీకి అతి తక్కువగా 23 అప్లికేషన్స్‌ అందాయి. స్టేట్‌లో పెద్ద వర్సిటీ ఉస్మానియాకు 114 దరఖాస్తులు వచ్చాయి. శాతవాహన వర్సిటీకి 125, మహాత్మాగాంధీ వర్సిటీకి 124, పాలమూరు వర్సిటీకి 122, తెలంగాణ వర్సిటీకి 114, కాకతీయ వర్సిటీకి 110, జేఎన్‌టీయూకు 56 వచ్చాయి. ఏ వర్సిటీ వీసీ ఇచ్చినా ఓకే అంటూ మరో 54 దరఖాస్తులున్నాయి. ఈసారి వీసీల నియామకాల్లో అన్ని కులాలకు అవకాశమివ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎస్సీ, బీసీ, ఓసీలకు రెండేసి చొప్పున.. ఎస్టీ, మైనార్టీలు ఒక్కొక్కరిని, మరో పోస్టుకు మహిళను ఎంపిక చేయాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. యూనివర్సిటీల్లో బీజేపీ భావజాలన్ని ఎదుర్కొనే సత్తా ఉన్నోళ్లనే వీసీలుగా నియమిస్తారనీ వాదనలు వినిపిస్తున్నాయి.