Vistara : విస్తారా విమానంలో ప్రయాణికురాలి వీరంగం

Vistara : విస్తారా విమానంలో ప్రయాణికురాలి వీరంగం

ముంబై : ఈ మధ్య విమానాల్లో కొంతమంది ప్యాసింజర్స్ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్న ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి. వారి అసభ్య చేష్టలతో మిగతా ప్రయాణికులకు విసుగు పుట్టిస్తున్న సంఘటనలు ఈ మధ్యే చాలా బయటపడ్డాయి. తాజాగా విస్తారా (Vistara) విమానంలో ఇటలీకి చెందిన ఓ 45 ఏళ్ల మహిళ వీరంగం సృష్టించింది. విమాన సిబ్బందిపై దాడి చేసింది. అంతేకాదు..విమానంలో అర్ధ నగ్నంగా అటు ఇటు తిరుగుతూ మిగతా ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించింది. విస్తారా విమాన సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఈనెల 30న అబుదాబీ నుంచి ముంబైకి వచ్చిన విస్తారా విమానంలో  జరిగింది.

అసలేం జరిగింది..? 

ఎకానమీ క్లాస్‌ టికెట్ తీసుకున్న ఇటలీకి చెందిన ఒక మహిళ తాను బిజినెస్‌ క్లాసులోనే కూర్చుంటానని పట్టుబట్టింది. విస్తారా విమాన సిబ్బంది ఒప్పుకోకపోవడంతో వారితో గొడవకు దిగి..దాడికి పాల్పడింది. అంతటితో ఆగకుండా విమానంలో అటు ఇటూ అర్ధ నగ్నంగా తిరిగింది. చాలాసార్లు విమాన సిబ్బంది హెచ్చరించినా వినిపించుకోకపోవడంతో కెప్టెన్‌ వార్నింగ్‌ కార్డ్‌ జారీ చేశారు. ఆ తర్వాత సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకుని ముంబై ఎయిర్‌పోర్టు అధికారులకు సమాచారమిచ్చారు. విమానం ల్యాండ్‌ అయిన తర్వాత సదరు మహిళను ముంబై పోలీసులు అరెస్టు చేశారు.