బ్యాంకుకే కుచ్చు టోపీ.. కస్టమర్ల పైసలతో రమ్మీ ఆడిండు

బ్యాంకుకే కుచ్చు టోపీ.. కస్టమర్ల పైసలతో రమ్మీ ఆడిండు
  •     రూ.8.5 కోట్లు కొట్టేసిన బ్యాంకు డిప్యూటీ మేనేజర్

నర్సంపేట, వెలుగు : వరంగల్​ జిల్లాలో తాను పనిచేస్తున్న బ్యాంకుకే కోట్ల రూపాయల కుచ్చు టోపీ పెట్టాడు డిప్యూటీ మేనేజర్. ఏకంగా రూ.8.5 కోట్ల కస్టమర్ల సొమ్ముతో ఆన్​లైన్​లో రమ్మీ ఆడి పోలీసులకు దొరికిపోయాడు. వరంగల్​ సిటీకి చెందిన బైరిశెట్టి కార్తీక్​ నర్సంపేట ఐసీఐసీఐ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్​గా పనిచేస్తున్నాడు. ఇటీవలే ఆడిటింగ్​ అధికారులు బ్యాంకు లావాదేవీలను తనిఖీ చేయగా 8.5 కోట్ల రూపాయలు తేడా ఉన్నట్లు గుర్తించారు. రెండు రోజుల క్రితం బ్యాంకు ​రీజనల్​ మేనేజర్​ ఓరుగుంటి శ్రీనివాస్​ నర్సంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఈ క్రమంలో 18 నెలలుగా కొనసాగుతున్న తన బాగోతం బయటపడడంతో డిప్యూటీ మేనేజర్​ కార్తీక్​ పరారయ్యాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా నిందితుడు అసలు విషయం చెప్పాడు. కస్టమర్ల సొమ్ముతో ఆన్​లైన్​లో రమ్మీ ఆడానని కార్తీక్  ఒప్పుకున్నాడు. అతనితో పాటు మరికొంత మంది పాత్రపైనా ఆరా తీస్తున్నామని టౌన్​ సీఐ సుంకరి రవికుమార్​ తెలిపారు.