శ్మశానవాటికలో ట్రాన్స్​జెండర్​ను  నరికి చంపిన గంజాయి బ్యాచ్

శ్మశానవాటికలో ట్రాన్స్​జెండర్​ను  నరికి చంపిన గంజాయి బ్యాచ్
  •     డెడ్​బాడీని చెట్ల పొదల్లో  విసిరేసి పరార్
  •     మర్డర్ కేసును ఛేదించిన  సనత్​నగర్ పోలీసులు
  •     నలుగురు యువకులు అరెస్ట్.. వీరిలో ఒకరిపై 19 కేసులు

సికింద్రాబాద్, వెలుగు : సనత్​నగర్​లో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. డబ్బు కోసం భిక్షాటన చేస్తున్న ట్రాన్స్​జెండర్​ను శ్మశానవాటికకు తీసుకెళ్లి నరికి చంపింది. ఇటీవల స్థానికంగా సంచలనం సృష్టించిన టాన్స్​జెండర్​షీలా మర్డర్​కేసును పోలీసులు ఛేదించారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరిపై 19 కేసులు ఉన్నట్లు గుర్తించారు. హత్యకు ఉపయోగించిన కత్తులు, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను బాలానగర్​డీసీపీ సురేశ్​కుమార్​సోమవారం మీడియాకు వెల్లడించారు.

బోయిన్​పల్లికి చెందిన షేక్ సాజిద్ అహ్మద్ అబ్బాస్​అలియాస్ షీలా(27) గతంలో ఫతేనగర్ లో ఉండేది. ఇటీవల కుత్బుల్లాపూర్​హెచ్ఎంటీ సొసైటీకి మారింది. రోజూ చుట్టుపక్కల ప్రాంతాల్లో భిక్షాటన చేస్తోంది. ఈ నెల12న తెల్లవారుజామున 4 గంటల సమయలో షీలా నర్సాపూర్ క్రాస్​రోడ్డు వద్ద భిక్షాటన చేస్తుండగా బాలానగర్​కు చెందిన ఫాబ్రికేషన్ వర్కర్​దుదాని సాగర్​సింగ్(26),  ఒన్నాపురం ప్రవీణ్(20), కరణ్​బిశ్వజిత్​ అలియాస్​బిశ్వనాథ్ అలియాస్ బిస్సు(20), బాలింగ్​అభినవ్(19) బైకులపై అక్కడికి చేరుకున్నారు. పైసలు ఇవ్వాలంటూ షీలాను చుట్టుముట్టారు.

భయపడిపోయిన షీలా తన వద్ద ఉన్న రూ.3 వేలు ఇచ్చింది. తమకు ఇంకా కావాలంటూ షీలాను హింసించడం మొదలుపెట్టారు. డబ్బు లేదని చెప్పినా వినిపించుకోకుండా సాగర్​సింగ్ షీలా ఫోన్​లాక్కున్నాడు. ఫోన్​పే పాస్​వర్డ్​చెప్పాలని పట్టుబట్టాడు. ఎంతకీ చెప్పకపోవడంతో షీలాను ఫతేనగర్ పరిధిలోని వాల్మీకినగర్​శ్మశానవాటికలోకి లాక్కెళ్లారు. తాడుతో అక్కడి స్తంభానికి కట్టేసి కట్టెలతో కొట్టారు. కత్తులతో గాయపరిచారు.

ఏటీఎం కోసం ఇంటికి.. 

యువకుల దెబ్బలకు తట్టుకోలేకపోయిన షీలా తన బ్యాంక్​అకౌంట్​లో డబ్బులు ఉన్నాయని, ఏటీఎం కార్డు ఇంట్లో ఉందని చెప్పింది. దీంతో షీలాను తీసుకుని ఆమె ఇంటికి వెళ్లారు. బీరువా తాళాలు పగలగొట్టి ఏటీఎం కార్డు కోసం వెతికారు. ఎంతకీ కనిపించకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. షీలాను తీసుకుని తిరిగి వాల్మీకినగర్ శ్మశాన వాటికకు చేరుకున్నారు. ఆమెను కింద పడేసి కాళ్లతో చాతిపై తన్నారు. అప్పటికే తీవ్రంగా గాయపడిన షీలాపై కత్తితో, కర్రతో దాడి చేసి చంపేశారు. తర్వాత డెడ్​బాడీని చెట్ల పొదల్లో విసిరేసి పారిపోయారు.

స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వాల్మీకినగర్​శ్మశానవాటిక, సమీప ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. సోమవారం నలుగురు యువకులను అరెస్ట్​చేశారు. హత్యకు ఉపయోగించిన కత్తి, కర్ర, రూ.2,500 నగదు, మూడు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఒకే ప్రాంతంలో ఉండే సాగర్​సింగ్, ప్రవీణ్, బిశ్వజిత్, అభినవ్ స్నేహితులు. మద్యం, గంజాయికి బానిసలుగా మారారు.

వీరిలోని సాగర్​సింగ్​పాత నేరస్తుడు. ఇతనిపై ఇప్పటికే 19 కేసులు ఉన్నాయి. చోరీలు, చైన్​స్నాచింగులు, మర్డర్ అటెంప్ట్ వంటి కేసులు నమోదు ఉన్నాయి. సాగర్​పై 2021లో పోలీసులు పీడీయాక్టు ప్రయోగించారు. ఏడాది పాటు జైలులో ఉండి వచ్చాడు. అయినప్పటికీ అతనిలో మార్పు రాకపోవడంతో రౌడీ షీట్​తెరిచారు. గంజాయి మత్తులో షీలాపై దాడి చేసి చంపినట్లు డీసీపీ వెల్లడించారు.