పైసలు సాలయ్.. చికెన్​ఎట్ల పెట్టుడు?

పైసలు సాలయ్.. చికెన్​ఎట్ల పెట్టుడు?
  • దశాబ్ది ఉత్సవాల్లో ఆఫీసర్లకు పెద్ద టాస్క్ ఇదే

ఖమ్మం, వెలుగు: రాష్ట్ర దశాబ్ది వేడుకల నిర్వహణ ఆఫీసర్లకు తలకు మించిన భారమైంది. జూన్​ 2 నుంచి 21 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలకు సర్కారు ప్లాన్ చేసింది. ఏ రోజు.. ఏ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించాలనేది షెడ్యూల్​ తయారు చేసి, ఇప్పటికే ఆయా డిపార్ట్ మెంట్లకు వాటిని సక్సెస్ చేసే బాధ్యత అప్పగించారు. అయితే కొన్ని శాఖల్లో నిర్వహించే ప్రోగ్రామ్స్ లో భాగంగా భోజనాల ఏర్పాటు ఆయా శాఖల ఆఫీసర్లకు తలనొప్పిగా మారనుంది.  

స్పాన్సర్స్​ కోసం వెతుకులాట..

2న దశాబ్ది ఉత్సవాలు గ్రాండ్​గా ప్రారంభం కానున్నాయి. 3న రైతు దినోత్సవాన్ని నిర్వహిస్తూ, అన్ని రైతు వేదికల దగ్గర వెయ్యి మందికి తగ్గకుండా బంతి భోజనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వ్యవసాయ శాఖ ఆఫీసర్లు, రైతు వేదిక ఉన్న గ్రామ సర్పంచ్, ఆయా క్లస్టర్ పరిధిలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను కూడా ఏర్పాట్లలో ఇన్వాల్వ్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ప్రభుత్వం ఇస్తున్న పైసలతో వెయ్యి మందికి చికెన్ తో భోజనాలు పెట్టడం సాధ్యం కాదని, తమ చేతి నుంచి సొంతంగా ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోందని ఆఫీసర్లు ఆఫ్ ది రికార్డు గా చెప్తున్నారు. కొన్ని చోట్ల ఖర్చులు భరించాలని సర్పంచులను అడుగుతుండగా, మరికొన్ని చోట్ల స్పాన్సర్స్​ ముందుకు వస్తారేమోనని వెతుకుతున్నారు.   మొత్తం 21 రోజుల్లో ఈనెల 3న అన్ని రైతు వేదికల దగ్గర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వెయ్యి మందికి తగ్గకుండా సహపంక్తి భోజనాలు, 4న పోలీసు శాఖ కార్యక్రమాలు, పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రాత్రి డిన్నర్ (బడా ఖానా), 5న విద్యుత్ విజయోత్సవాలు, సింగరేణి సంబురాల్లో భాగంగా సింగరేణి కార్మికుల కుటుంబ సభ్యులకు మధ్యాహ్నం భోజనాలు, 8న చెరువుల పండుగలో భాగంగా సాయంత్రం ప్రతీ గ్రామంలో చెరువు కట్ట దగ్గర సంబురాలు, రాత్రి భోజనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈనెల 20న విద్యా దినోత్సవంలో భాగంగా ఆయా ప్రభుత్వ స్కూళ్లలో పేరెంట్స్ కు భోజనాలు  ప్లాన్ చేశారు. 

డిన్నర్ అంటే కష్టమే..!

చెరువుల పండుగలో భాగంగా 8న అన్ని గ్రామాల్లో చెరువు కట్టల మీద సంబురాలను ఇరిగేషన్  డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు. దీనికి పోలీసులు బందోబస్తు, సెక్యూరిటీ ఏర్పాట్లు చూడాల్సి ఉంటుంది. చెరువుల దగ్గర రాత్రి భోజనాలకు లైటింగ్, సౌలతులు ఏర్పాటు చేయడం మెయిన్ టాస్క్ అయితే, మద్యం తాగి భోజనానికి వచ్చే వారిని కంట్రోల్ చేయడం, చెరువుల్లో ఎవరూ పడిపోకుండా చూసుకోవడం, బారికేడ్లు ఏర్పాటుచేయడం, తడిగా, పదునుగా ఉన్న చోట్ల ఎవరూ జారి పడిపోకుండా చూడడం, ఒకవేళ అనుకోని ప్రమాదం జరిగితే వెంటనే నీళ్లలో కాపాడే విధంగా గజఈతగాళ్లను రెడీగా ఉంచడం, ఎక్కువ మంది వస్తే అదుపుచేయడం.. ఇవన్నీ పోలీస్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో చేయాల్సి ఉంటుంది. ఆయా మండలాల్లో ఉన్న చెరువుల సంఖ్య కంటే పోలీసు సిబ్బంది సంఖ్య తక్కువగా ఉండడంతో ఎలా ఏర్పాట్లు చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. 

మహిళలకు భోజనాలు లేవు..

21 రోజుల పాటు ప్రభుత్వం ప్లాన్ చేసిన కార్యక్రమాల్లో రెండ్రోజులు ప్రధానంగా మహిళలను ఇన్వాల్వ్ చేసే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈనెల 13న మహిళా సంక్షేమ దినోత్సవం, 18న మంచి నీళ్ల పండుగలో మహిళల పార్టిసిపేషన్​ ఉండాలని నిర్ణయించారు. ఈ రోజుల్లో ముందుగా నిర్ణయించిన షెడ్యూల్​ ప్రకారం అధికారికంగా భోజనాలు ఏర్పాటు చేయడం లేదు. దీంతో మహిళలేం పాపం చేశారని కొందరు అభిప్రాయపడ్తున్నారు. 

21 రోజులు సెలవుల్లేవ్..

దశాబ్ది సంబురాల సందర్భంగా ఈనెల 2 నుంచి 21 వరకు ఉన్నతాధికారులెవరూ సెలవులు తీసుకోవద్దని ఓరల్​గా ఆదేశాలు అందాయి. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే తప్ప అందరూ అందుబాటులో ఉండాలని జిల్లాలవారీగా రివ్యూ మీటింగుల్లో కలెక్టర్లు, ఉన్నతాధికారులకు గట్టిగానే  చెప్తున్నారు.