గ్రీస్‌లో పడవ ప్రమాదం..78 మంది వలసదారులు మృతి 

గ్రీస్‌లో పడవ ప్రమాదం..78 మంది వలసదారులు మృతి 

గ్రీస్ లో ఘోర ప్రమాదం జరిగింది. వలసదారులతో వెళ్తున్న పడవ మధ్యదరా సముద్రంలో మునిగిపోయింది. గ్రీస్ తీరానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మంగళవారం (జూన్ 13న) జరిగిన ఈ దుర్ఘటనలో 78 మంది మరణించారు. చాలా మంది గల్లంతయ్యారు. పెలోపొన్నీస్ తీరానికి సమీపంలోని పైలోస్ పట్టణానికి నైరుతి దిశలో 87 కిలోమీటర్లు దూరంలో అంతర్జాతీయ జలాల్లో పడవ బోల్తా పడిందని గ్రీక్ కోస్ట్‌గార్డ్ తెలిపింది. 

ఓడ తూర్పు లిబియా నుంచి ఇటలీకి వలసదారులతో వెళ్తున్న సందర్భంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మరణించిన వారిలో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ కు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. 

ఇప్పటి వరకు 104 మంది ప్రయాణికులను రక్షించినట్లు అధికారులు తెలిపారు. గల్లంతైనా వారికోసం భారీ రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగిస్తున్నారు. కోస్ట్‌గార్డ్‌కు చెందిన ఆరు పడవలు, నావికదళ పడవతోపాటు సైనిక విమానాలు, హెలికాప్టర్లు, పలు ప్రైవేటు పడవలు, డ్రోన్లు కూడా రంగంలోకి దిగి గల్లంతైన వారికోసం గాలిస్తున్నాయి. భారీ గాలులు వీడయంతో పడవ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది.

పశ్చిమాసియా, ఆఫ్రికా నుంచి పెద్ద సంఖ్యలో వలసలు సాగుతున్నాయి. ఆయా దేశాల్లో సంక్షోభం, హింస కారణంగా చాలా మంది పొట్టచేత పట్టుకుని యూరప్ దేశాలకు వలస వెళ్తున్నారు. ఇలా వలసవెళ్లేవారికి గ్రీస్ దేశం యూరప్ యూనియన్ లోకి గేట్ వేగా మారింది. అనేక మంది టర్కీ నుంచి గ్రీస్ దేశంలోని ద్వీపాలకు పడవల ద్వారా ప్రయాణిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. 

అక్రమ వలసలను కట్టడి చేసేందుకు లిబియా అధికారులు ఇటీవల ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టారు. ఈ క్రమంలో ఈజిప్టు, సిరియా, సూడాన్, పాకిస్థాన్‌ దేశాలకు చెందిన వేల మందిని అదుపులోకి తీసుకున్నట్లు నివేదికలు వెల్లడించాయి. వారిలో ఈజిప్టునకు చెందిన వారిని రోడ్డు మార్గంలో సొంత దేశానికి పంపించేశారు. మరోవైపు పశ్చిమ లిబియాలో అక్రమ వలస స్థావరాలపైనా అక్కడి అధికారులు దాడులు చేశారు. సుమారు 1800 మందిని అదుపులోకి తీసుకొని నిర్బంధ కేంద్రాలకు తరలించినట్లు ఐరాస శరణార్థి విభాగం వెల్లడించింది.