
గచ్చిబౌలి, వెలుగు: అంగన్వాడీ వద్ద నీటి సంపులో పడి మూడేండ్ల బాలుడు మృతి చెందాడు. వికారాబాద్‌కు చెందిన పరమేశ్వర్ తన భార్య, ఇద్దరు కొడుకులతో కలిసి 8 నెలల కింద గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డ్ గా చేరాడు. పరమేశ్వర్ పెద్ద కొడుకు జయవర్ధన్ నానక్ రామ్ గూడలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతుండగా, చిన్న కొడుకు నిఖిల్ తేజ్ (4) ఇదే స్కూల్ ఆవరణలో ఉన్న అంగన్వాడీకి వెళ్తున్నాడు.
శుక్రవారం ఉదయం ఇద్దరు కలిసి స్కూల్‌కు వెళ్లారు. సాయంత్రం స్కూల్ నుంచి పెద్ద కొడుకు ఒక్కడే ఇంటికి రావడంతో తమ్ముడు ఎడని తల్లిదండ్రులు అడగడంతో తనతో రాలేదని చెప్పాడు. దీంతో స్కూల్ వద్దకు చేరుకొని అంగన్వాడీ సిబ్బందిని ఆరా తీయగా, పిల్లలందరూ వెళ్లిపోయినట్లు చెప్పారు.
అనుమానం వచ్చి నీటి సంపులో చూడగా, నిఖిల్ తేజ్ నీటితో తెలియాడుతూ కనిపించాడు. వెంటనే బయటకు తీసి చూడగా, అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. గచ్చిబౌలి పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాలుడి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.