లోయలో పడ్డ బస్సు.. 27 మంది మృతి.. ఎక్కడంటే...

లోయలో పడ్డ బస్సు.. 27 మంది మృతి.. ఎక్కడంటే...

పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సులో లోయలో పడి 27 మంది ప్రాణాలు కోల్పోయారు. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని బసిమా పట్టణంలో బుధవారం ( మే 29)  తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. 54 మంది ప్రయాణికులతో కూడిన బస్సు టర్బాట్ సిటీ నుంచి క్వెట్టాకు వెళ్తుండగా.. కొండ ప్రాంతంలోని మూల మలుపు వద్ద అదుపు తప్పి లోయలో పడినట్టు స్థానిక ప్రభుత్వ అధికారి ఇస్మాయిల్ మెంగల్ తెలిపారు. దీంతో 27 మంది అక్కడికక్కడే మరణించగా మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

also read : కరణ్ భూషణ్ సింగ్ కాన్వాయ్‌ బీభత్సం.. ఇద్దరు మృతి

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అతి వేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ ఘటనపై పాక్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ స్పందించారు. ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. కాగా, గత నెలలో  (ఏప్రిల్ ) బలూచిస్తాన్‌లోని హబ్ జిల్లాలో ఒక పుణ్యక్షేత్రానికి వెళుతుండగా జరిగిన ప్రమాదంలో 17 మంది యాత్రికులు మరణించగా.. 41 మంది గాయపడ్డారు.