బెంగళూర్: కర్నాటకలోని మైసూర్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ వ్యాపారవేత్త తన భార్య, ఇద్దరు కూతుళ్లను హత్య చేసి ఆ తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ వ్యాపారం చేసే హరీష్ తన భార్య నిశ్చయ (34), కుమార్తెలు నిక్షా (12), రక్ష (8)తో కలిసి మైసూరులోని హున్సూర్ టౌన్‌లో నివాసం ఉంటున్నారు. వ్యాపారంలో నష్టం రావడంతో హరీష్ తీవ్ర ఆర్ధిక సమస్యల్లో కూరుకుపోయాడు.
ఈ సమస్యల నుంచి గట్టెక్కాలో తెలియక చివరకు చావే శరణ్యమనుకున్నాడు. అయితే, తాను ఒక్కొడినే చనిపోతే కుటుంబం ఇబ్బందుల పాలవుతుందని భావించి మొత్తం ఫ్యామిలీతో కలిసి చనిపోవాలని భావించాడు. ఇందులో భాగంగానే భార్య, ఇద్దరు కూతుళ్ల ముక్కు, నోళ్లకు ప్లాస్టర్ అంటించి ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు. ఆ తర్వాత అతడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హరీష్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతకు బయటకు రాకపోవడంతో చుట్టుపక్కలా వారు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు.
స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు హరీష్ ఇంటి తలుపులను బద్దలుకొట్టి లోపలికి వెళ్లారు. ఇంట్లో అతడి భార్య, ఇద్దరు కూతుళ్లు విగతజీవులుగా కనిపించారు. రెండో అంతస్థులో హరీష్ ఉరి వేసుకుని చనిపోయాడు. ఘటన స్థలంలో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నలుగురి మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
సూసైడ్ నోట్లో తనకున్న ఆస్తుల వివరాలు, ఎవరెవరికి ఎంతెంత అప్పులు ఉన్నాయనే విషయాలను స్పష్టంగా రాశాడు. ఆస్తి పత్రాలు ఉన్న లాకర్ తాళాలు ఎక్కడ ఉన్నాయి.. వాటిని ఎవరికి ఇవ్వాలో రాశాడు. హరీష్ తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆర్ధిక సమస్యల కారణంగానే హరీష్ తన భార్య, కూతుళ్లను చంపి అతడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
