- పండ్లు అమ్ముకునే మహిళ మృతి
- మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
- ప్రమాదానికి అతివేగమే కారణం
రామాయంపేట, వెలుగు : మెదక్ జిల్లా రామాయంపేటలో ఆదివారం ఓ కారు భీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన పండ్లు అమ్ముతున్న చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లడంతో ఓ మహిళ అక్కడికక్కడే చనిపోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రోజు మాదిరిగా స్థానిక బస్టాండ్ వద్ద రోడ్డు పక్కన చిరు వ్యాపారులు పండ్లు అమ్ముకుంటున్నారు. హవేళి ఘనపూర్ మండలం లింగ్సాన్పల్లికి చెందిన ఎర్రోళ్ల దుర్గా ప్రసాద్..కామారెడ్డి నుంచి హైదరాబాద్ వైపు కారులో వెళ్తున్నాడు. బస్టాండ్ ఎదురుగా వచ్చే సరికి స్పీడ్‌గా ఉండడంతో అదుపు తప్పి మామిడి పండ్లు అమ్మేవారిపై దూసుకువెళ్లింది.
ఈ ఘటనలో మండలంలోని డి.ధర్మారం గ్రామానికి చెందిన పున్న రేణుక (55) తీవ్రంగా గాయపడి స్పాట్ లోనే చనిపోయింది. అక్కడే ఉన్న పట్టణానికి చెందిన జలగడుగుల సత్యం కాళ్లపై నుంచి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అలాగే కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం భాగిర్తిపల్లికి చెందిన కొఠారి గంగమణి, రింకు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108 అంబులెన్స్ లో రామాయంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కురిక్యాల శివారులో ఢీకొన్న కార్లు: ఒకరు మృతి
గంగాధర : కరీంనగర్-– జగిత్యాల హైవేపై గంగాధర మండలం కురిక్యాల శివారులో ఆదివారం రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒకరు చనిపోగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఎస్సై అభిలాష్ కథనం ప్రకారం..వేములవాడకు చెందిన సోమినేని అజయ్(32) కరీంనగర్ లోని వావిలాలపల్లిలో ఉంటూ మెడికల్ బిజినెస్ చేస్తున్నాడు. ఆదివారం ఓ పనిపై కరీంనగర్ వెళ్తుండగా కొమురవెల్లి నుంచి కొండగట్టు వెళ్తున్న మరో కారు.. అజయ్ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో అజయ్ అక్కడిక్కడే చనిపోయాడు. మరో కారులోని వైరాగి అభిషేక్, జగదీష్ గాయపడగా 108లో కరీంనగర్ హాస్పిటల్‌కు తరలించారు. మృతుడికి ఎనిమిదేండ్ల పాప, మూడేండ్ల బాబు, భార్య ఉన్నారు.
చంచుపల్లిలో ఆటోను ఢీ కొన్న కారు
- నలుగురి పరిస్థితి విషమం
సుజాతనగర్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలోని 4 ఇంక్లైన్ జాతీయ రహదారిపై ఆదివారం ఆటోను కారు ఢీకొట్టడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం..విజయవాడ నుంచి భద్రాచలం వైపు వెళ్తున్న కారు 4 ఇంక్లైన్ బస్టాండ్ వద్ద రోడ్డు క్రాస్ చేస్తున్న ఆటోను ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు రోడ్డుపై పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని పోలీసులు జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్తరలిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు.