ఇసుక లారీలను అడ్డుకుని ఆందోళన చేస్తే..

ఇసుక లారీలను అడ్డుకుని ఆందోళన చేస్తే..
  • కాంగ్రెస్ నేతలపై కేసులు పెట్టిన పోలీసులు

కరీంనగర్ జిల్లా : అదనపు లోడుతో వెళ్తున్నాయని జమ్మికుంట పట్టణంలో ఇసుక లారీలను ఆపి ఆందోళన నిర్వహించిన హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి బల్మూరి వెంకట్ తోపాటు మరో 12 మంది కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు.  ప్రభుత్వ అనుమతితో నడుస్తున్న ఇసుక లారీలను ఆపి వాహనదారులను భయభ్రాంతులకు గురిచేయడమే కాకుండా సాధారణ ప్రజానీకం రాకపోకలకు అంతరాయం కలిగించారనే అభియోగాల కింద కేసులు నమోదు చేశారు.

ప్రతి రెండింటిలో ఒకటి అధిక లోడ్ తో వెళ్తున్నాయని ఆందోళన

కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో నిన్న కాంగ్రెస్ నేతలు ఇసుక లారీలను అడ్డుకున్న విషయం తెలిసిందే. లోడ్ తో వెళ్తున్న ఇసుక లారీలను వేబ్రిడ్జి వద్ద బరువు తూకం వేయిస్తే.. ఒక్కో లారీలో సామర్థ్యాని కంటే ఐదు నుంచి ఎనిమిది టన్నులు అదనంగా నింపుతున్నాయని గుర్తించామని బల్మూరి వెంకట్ వెల్లడించారు. నిన్న ఒక్కరోజే పది లారీలు వేబ్రిడ్జి వేయిస్తే ఐదు లారీలు అధిక లోడుతో ఉన్నాయని.. అలాగే సాయంత్రం 6 గంటల తర్వాత రైల్వే ఓవర్ బ్రిడ్జి మీద నుంచి లారీలు వెళ్ళొద్దని నిబంధనలు ఉన్నప్పటికీ... వాటిని పాటించడంలేదని ఆరోపించారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన క్వారీ నిర్వాహకులు జమ్మికుంట మండలంలో ఎలా తవ్వకాలు జరుపుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక మాఫియా ఇంత స్వేచ్ఛగా రెచ్చిపోతుంటే... ప్రభుత్వం చోద్యం చూస్తుందా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఏ ఒక్క లారీని తిరగనివ్వబోమని ప్రకటించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ నేతల ఆందోళనపై పోలీసులు స్పందించి వారి మీదనే కేసులు నమోదు చేశారు.