ఘట్ కేసర్, వెలుగు: కిడ్నాప్ కు యత్నించిన కేసులో పీర్జాదిగూడ కార్పొరేటర్ అమర్ సింగ్ తో పాటు మరికొందరు కార్పొరేటర్లపై కేసు నమోదైంది. ఘట్ కేసర్ పోలీసులు తెలిపిన ప్రకారం.. పీర్జాదిగూడ కార్పొరేషన్ మేయర్ పై అవిశ్వాసానికి సిద్ధమవగా.. కార్పొరేటర్ అమర్ సింగ్ పదవీ కోసం పోటీ పడ్డాడు. దీంతో మేయర్ జక్కా వెంకటరెడ్డి తనపైనే అవిశ్వాసం నోటీసు ఇవ్వగా.. జూన్ 5న బల నిరూపణకు మేడ్చల్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశాడు. అమర్ సింగ్ మెజార్టీ కార్పొరేటర్లను తనవైపు తిప్పుకునే ప్రయత్నాలు ప్రారంభించాడు. ఈనెల19న రాత్రి ఘట్ కేసర్ టోల్ ప్లాజా వద్ద మేయర్ తో పాటు అతనికి మద్దతు తెలిపిన కార్పొరేటర్లను కిడ్నాప్ చేసేందుకు అమర్ సింగ్, అతని అనుచరులు యత్నించారు.
అంతేకాకుండా దాడికి పాల్పడడంతో మేయర్ , బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఘట్ కేసర్ పీఎస్ లో మరుసటి రోజు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు అమర్ సింగ్ తో పాటు 13వ డివిజన్ కార్పొరేటర్ భర్త తూంకుంట శ్రీధర్ రెడ్డి, 22వ డివిజన్ కార్పొరేటర్ భీంరెడ్డి నవీన్ రెడ్డి, 3వ డివిజన్ కార్పొరేటర్ భర్త మాడ్గుల చంద్రారెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు చిలుముల జగదీశ్వర్ రెడ్డి, 26వ డివిజన్ కార్పొరేటర్ భర్త పప్పుల అంజిరెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్, కాంగ్రెస్ నేత నర్సింహ్మరెడ్డితో పాటు మరికొందరిపై 365, 147 ఆర్/డబ్ల్యూ 511 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు గురువారం ఘట్ కేసర్ పోలీసులు తెలిపారు.
