ఓటుకు నోటు కేసు ..ఆగస్టు చివరి వారానికి వాయిదా

ఓటుకు నోటు కేసు ..ఆగస్టు చివరి వారానికి వాయిదా

ఆగస్టు చివరి వారానికి వాయిదా
మళ్లీ వాయిదా కోరవద్దని రేవంత్ అడ్వకేట్​కు సుప్రీంకోర్టు స్పష్టం

న్యూఢిల్లీ, వెలుగు: ‘ఓటుకు నోటు’ కేసు విచారణను సుప్రీం కోర్టు ఆగస్టు నెల చివరి వారానికి వాయిదా వేసింది. ‘ఓటుకు నోటు’ కేసు ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ పరిధిలోకి రాదంటూ నిందితులు ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే వెంకట వీరయ్య దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. సుప్రీంలో పిటిషన్లు దాఖలు చేశారు. గురువారం వీటిపై జడ్జీలు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా ఎం.త్రివేది బెంచ్ విచారించింది. సీనియర్ న్యాయవాది లేనందున కేసు విచారణ వాయిదా వేయాలని రేవంత్ తరఫు జూనియర్ అడ్వకేట్ కోరారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం తరఫు అడ్వకేట్ హరీన్ రావల్ అభ్యంతరం తెలిపారు. 2015 లో ‘ఓటుకు నోటు’ వ్యవహారం జరిగిందని.. సుదీర్ఘకాలం తర్వాత గతేడాది ఆరంభంలో పిటిషన్ సుప్రీంకోర్టు బెంచ్ ముందుకు వచ్చిందన్నారు. అప్పుడు పిటిషనర్ వాయిదా కోరారని వివరించారు. మధ్యలో జోక్యం చేసుకున్న ధర్మాసనం... ఈ పిటిషన్ పెండింగ్​లో ఉన్న అంశం తమకు తెలుసని వ్యాఖ్యానించింది. కేసు తదుపరి విచారణ సందర్భంగా వాయిదా కోరవద్దని రేవంత్ తరఫు న్యాయవాదికి ధర్మాసనం స్పష్టం చేసింది.