సైలెంట్ అయిన న్యూడ్ కాల్ వ్యవహారం కేసు

సైలెంట్ అయిన న్యూడ్ కాల్ వ్యవహారం కేసు

గద్వాల, వెలుగు : కొద్దిరోజుల కింద వెలుగుచూసిన న్యూడ్ కాల్ వ్యవహారం జోగులాంబ గద్వాల జిల్లాను షేక్ చేసింది. కానీ ప్రస్తుతం అంతా సైలెంట్ గా మారిపోయింది. ముగ్గురు నిందితులను తప్ప ఇప్పటివరకు మరెవరినీ అరెస్టు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.  ఏ1 తిరుమలేష్ అలియాస్ మహేశ్వర్ రెడ్డిని, ఇతర నిందితులైన నిఖిల్, ధీర వినోద్ కుమార్ లను కస్టడీకి తీసుకున్నా సాధించింది ఏమీ లేదని తెలుస్తోంది. ఈ కేసులో కేవలం ఫోన్ లో చాట్​చేసిన వారు, ఫొటోలు షేర్ చేసిన వారిని మాత్రమే అరెస్టు చేశారని అసలైన నిందితులను తప్పించారనే ప్రచారం జరుగుతోంది.

సాక్ష్యాలు దొరలేదా? 

సోషల్ మీడియాలో వచ్చిన ఫొటోల ఆధారంగానే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు తప్పితే అరెస్టు చేసిన వారి నుంచి ఎలాంటి సాక్ష్యాలు కలెక్ట్ చేయలేకపోయారన్న విమర్శలు వస్తున్నాయి. ఒక నిందితుడు తన ఫోన్​ను పగలగొట్టి పడేశాడని, దీంతో వేరే సిమ్ తీసుకొని మెయిల్ ద్వారా 10 ఫొటోలు కలెక్ట్ చేశామని ప్రెస్ మీట్ లో ఎస్పీ చెప్పారు. అయితే సోషల్ మీడియాలో వచ్చిన ఫొటోలు కూడా ఇవేనని అన్నారు. అయితే మిగతా ఇద్దరు నిందితుల ఫోన్లు ఏమయ్యాయి? వారి దగ్గర ఎందుకు ఎవిడెన్స్ కలెక్ట్ చేయలేదు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్థానిక అధికార పార్టీ లీడర్ల ప్రమేయం ఉండడం, రాజకీయ ఒత్తిడితో పోలీసులు ఇలా వ్యవరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  ఎంక్వైరీ నిష్పక్షపాతంగా కొనసాగుతోందని, ఎవరినీ వదిలేది లేదని గద్వాల సీఐ చంద్రశేఖర్ ప్రకటించారు.