101 ఏళ్ల వయస్సులోనూ నడుస్తూ వెళ్లి ఓటు వేస్తున్నాడు : ఇతని ఆరోగ్య రహస్యం ఇదే.. !

  101 ఏళ్ల వయస్సులోనూ నడుస్తూ వెళ్లి ఓటు వేస్తున్నాడు : ఇతని ఆరోగ్య రహస్యం ఇదే.. !

పతనంతిట్ట జిల్లా, అదూర్‌లోని చెరుకోడ్‌లో నివసిస్తున్న 101 ఏళ్ల గంగాధరన్ ఆచారి  మనందరికీ ఒక గొప్ప స్ఫూర్తి. ఈ వయసులో కూడా ఆయన ఏమాత్రం తగ్గకుండా ఎన్నికల్లో ఓటు వేస్తూ తన బాధ్యతను నెరవేరుస్తున్నారు. 

నమ్మకం, ఉత్సాహం
వయసు వంద దాటినా, గంగాధరన్  మనసు, శరీరం చాలా బలంగా ఉన్నాయి. నా ఓటు నేనే వేసుకోగలను, ఎవరి సహాయం నాకు అక్కర్లేదు అని ఆయన గర్వంగా చెబుతారు. ఇన్నేళ్లలో ఎన్నిసార్లు ఓటు వేశారో ఆయనకే గుర్తులేదు కానీ, ఓటు వేయాలనే ఉత్సాహం మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది.

తొలి ఓటు జ్ఞాపకాలు
1925లో జన్మించిన ఆయన మొదటిసారి తన సొంత ఊరు ఓమల్లూరులో ఓటు వేశారు. పాత రోజులను గుర్తు చేస్తూ.. అప్పట్లో కేవలం ఇంటి పన్ను కట్టే వారికే ఓటు హక్కు ఉండేదట. రేడియో ద్వారా వచ్చే కార్యక్రమాలను వింటూ ఆయన ఎన్నికల గురించి, ప్రజాస్వామ్యం గురించి తెలుసుకున్నారు. మొదటిసారి ఓటు వేసినప్పుడు తోటివారు చెప్పిన గుర్తుకే ఓటు వేశారు. అప్పటి నుండి ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ఆయన ఓటు వేస్తూనే ఉన్నారు.

ఎవరిపై ఆధారపడకుండా
గత 68 ఏళ్లుగా ఆయన చెరుకోడ్‌లోనే ఉంటున్నారు. ఆయనకు పెద్ద కుటుంబం, పిల్లలు, మనవళ్లు ఉన్నప్పటికీ, పోలింగ్ బూత్‌కు ఎవరి సాయం లేకుండా సొంతంగా వెళ్లడానికే ఇష్టపడతారు. ఆయన ఏ ఒక్క పార్టీకి కట్టుబడి ఉండరు. అభ్యర్థి ఎవరు, ప్రస్తుత పరిస్థితులు ఏంటి అని ఆలోచించి ఓటు నిర్ణయం తీసుకుంటారు.

చారిత్రక వ్యక్తులతో పరిచయం
ఆయన జీవితం ఒక చరిత్ర పుస్తకం లాంటిది. తన చిన్నతనంలో ఎలాంతూర్‌లో మహాత్మా గాంధీని చూశారు. శ్రీ చిత్ర తిరునాల్, సర్ సి.పి, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి గొప్ప వ్యక్తులను కలిసిన జ్ఞాపకాలు ఆయనకు ఉన్నాయి.

ఆరోగ్య రహస్యం 
ఆయన ఇంత ఆరోగ్యంగా ఉండటానికి కారణం ఆయన క్రమశిక్షణే. ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేస్తారు. లేచాక అర కిలోమీటరు నడుస్తారు. ఆహారం చాలా తక్కువగా తింటారు. పాలు, నీళ్లు, కొద్దిగా అన్నం, గుడ్డు కూరతో పొరోటా ఆయనకు ఇష్టమైన ఆహారం. వయసు కారణంగా పళ్ళు ఊడిపోయిన  చాల హుషారుగా ఉంటాడు.  

ప్రజాస్వామ్యంపై ఉన్న గౌరవంతో, రాబోయే ఎన్నికల్లో కూడా తన ఇంటి దగ్గర్లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేయడానికి ఆయన రెడీగా ఉన్నారు.