ఉద్యమ కారులను గుర్తించడానికి కమిషన్ ఏర్పాటు చేయాలి : మాజీ మంత్రి మేచినేని కిషన్ రావు

ఉద్యమ కారులను గుర్తించడానికి కమిషన్ ఏర్పాటు చేయాలి : మాజీ మంత్రి మేచినేని కిషన్ రావు
  •     ప్రొఫెసర్ కోదండరాం ఈ అంశాన్ని మంత్రి వివేక్ దృష్టికి తీసుకెళ్లారు
  •     1969 ఉద్యమకారుల సమితి నేతలు   

హైదరాబాద్,వెలుగు: తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి ప్రభుత్వం వెంటనే కమిషన్ ఏర్పాటు చేయాలని1969 తెలంగాణ ఉద్యమ కారుల సమితి ప్రెసిడెంట్, మాజీ మంత్రి మేచినేని కిషన్ రావు, సెక్రటరీ జనరల్ దుశ్చర్ల సుదర్శన్ రావు డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలో ఇచ్చిన విధంగా ఉద్యమ కారులకు నెలకు రూ. 25 వేల పెన్షన్, 250 గజాల ఇంటి స్థలం, కంటోన్మెంట్​లో ఉద్యమకారుల పేరుతో స్మృతి వనం ఏర్పాటు చేయాలని కోరారు. 

ఈ మేరకు శనివారం బంజారాహిల్స్ లో ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు. కమిషన్ ఏర్పాటు చేయకపోతే ధర్నాచౌక్​లో ఉద్యమ కారులందరం కలిసి నిరాహార దీక్ష చేస్తామని నేతలు ప్రకటించారు.  టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఉద్యమ కారుల సమస్యలను కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లారని నేతలు తెలిపారు. 

ఉద్యమకారులను గుర్తించడానికి కమిషన్ ఏర్పాటు చేయాలని శాసనమండలిలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఇటీవల ఈ అంశాన్ని ప్రస్తావించారని చెప్పారు. గత 10 ఏండ్లుగా ఉద్యమ కారులను మాజీ సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని నేతలు పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వంలో ఉద్యమకారులను గుర్తించి సెక్రటేరియెట్​లో కొంత మందిని సీఎం సన్మానించడం గర్వకారణమన్నారు. మిగతా వాళ్లను సైతం సన్మానించి, పెన్షన్, ఇంటి స్థలం ఇవ్వాలని నేతలు కోరారు.