అమెరికాలో రిలయన్స్ భారీ పెట్టుబడి.. విషెస్ చెప్పిన ట్రంప్

అమెరికాలో రిలయన్స్ భారీ పెట్టుబడి.. విషెస్ చెప్పిన ట్రంప్
  • 300 బిలియన్ డాలర్ల అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ ఏర్పాటులో భాగస్వామ్యం 
  •  ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ 

వాషింగ్టన్/న్యూఢిల్లీ : రిలయన్స్​ ఇండస్ట్రీస్​ అమెరికాలో భారీ పెట్టుబడి పెట్టేందుకు రెడీ అయింది. టెక్సాస్ రాష్ట్రంలోని బ్రౌన్స్​విల్లే వద్ద ‘అమెరికా ఫస్ట్​ రిఫైనరింగ్ సంస్థ’ ఏర్పాటు చేయబోతున్న భారీ రిఫైనరీ ప్రాజెక్టులో భాగస్వామ్యం కాబోతున్నది. ఈ విషయమై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ బుధవారం ప్రకటన చేశారు. ఈ ప్రాజెక్టు విలువ సుమారు 300 బిలియన్​ డాలర్లు అని వెల్లడించారు. 

ఇది చరిత్రాత్మకమైన నిర్ణయమని, దాదాపు 50 ఏండ్ల తర్వాత అమెరికాలో కొత్త ఆయిల్ రిఫైనరీని ఏర్పాటు కానుందని చెప్పారు. ఇందులో భాగస్వామ్యం కాబోతున్న రిలయన్స్​కు అభినందనలు తెలిపారు. అమెరికా చరిత్రలోనే ఇది అతిపెద్ద పెట్టుబడి అని ట్రంప్​పేర్కొన్నారు. ఈ రిఫైనరీ ఏర్పాటుతో వేలాది మందికి ఉపాధి దొరకడంతోపాటు టెక్సాస్  ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. 

ఈ ప్రాజెక్టుతో అమెరికా ఇంధన సామర్థ్యం పెరుగుతుందన్నారు.  ఈ రిఫైనరీ పూర్తిగా అమెరికాలో ఉత్పత్తి అయ్యే షేల్ ఆయిల్‌‌తోనే పనిచేసేలా రూపకల్పన చేయనున్నట్లు అమెరికా ఫస్ట్​ రిఫైనరింగ్  సంస్థ తెలిపింది. రిలయన్స్ సంస్థ ఈ రిఫైనరీలో తయారయ్యే ఇంధనాన్ని 20 ఏండ్ల పాటు కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు 2026 రెండో త్రైమాసికంలో ప్రారంభం కానున్నట్టు సమాచారం.