హైదరాబాద్, వెలుగు: వృద్ధులు తమ సమస్యలపై ఫిర్యాదు చేయడానికి ఇక మీదట ఆర్డీవో ఆఫీసులు, కలెక్టరేట్లకు వెళ్లాల్సిన అవసరం లేదని.. మీ సేవ కేంద్రాల ద్వారా ఆన్లైన్లో ఫిర్యాదు చేసుకోవచ్చని మంత్రి సీతక్క సూచించారు. మంగళవారం రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా వయో వృద్ధుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఫిర్యాదుల నమోదు యాప్‌ను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఆన్లైన్ ఫిర్యాదు విధానాన్ని ప్రవేశపెట్టిన మొట్ట మొదటి రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు.
త్వరలో వయోవృద్ధుల కోసం ఉచిత టోల్ ఫ్రీ నెం.14567 సేవలను పటిష్ట పరుస్తామన్నారు. అలాగే, పిల్లలు తమ తల్లిదండ్రులను సరిగా చూసుకోకపోతే పంచి ఇచ్చిన ఆస్తిని తిరిగి పొందే హక్కు వృద్ధులకు ఉందని, పిల్లల ప్రేమకు నోచుకోని తల్లిదండ్రులకు తిరిగి ఆస్తిని అప్పగించేలా చర్యలు తీసుకుంటామన్నారు. వృద్ధులకు బస్సుల్లో ప్రయాణ రాయితీలు కల్పించే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. వృద్ధులకు కేంద్రం నెలవారి పెన్షన్ కేవలం రూ. 200 ఇస్తుందని, ధరలు పెరిగినా పదేండ్లుగా ఒక్క రూపాయి పెంచలేదని గుర్తు చేశారు. ఇకనైనా లబ్ధిదారుల సంఖ్యను, పింఛన్ మొత్తాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. అనంతరం పలువురు వృద్ధులను సీతక్క సన్మానించారు. వయో వృద్ధుల సంరక్షణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తూ.. రెండు నెలల్లో 200 వయోవృద్ధుల కేసులను పరిష్కరించిన హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని మంత్రి అభినందించి, సన్మానించారు. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, వయో వృద్ధులు, వికలాంగులు, ట్రాన్స్జెండర్ల సాధికారత శాఖ డైరెక్టర్ శైలజ పాల్గొన్నారు.
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు బతుకమ్మ వేడుకల్లో పాల్గొనవచ్చు..
రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి ప్రారంభమైయ్యే బతుకమ్మ వేడుకల్లో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు పాల్గొనే వెసులుబాటును కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. మధ్యాహ్నం 2 గంటల వరకు అంగన్వాడీలో విధులు నిర్వర్తించి ఆ తర్వాత బతుకమ్మ వేడుకల్లో పాల్గొనవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
నాణ్యతలో రాజీ పడొద్దు: మంత్రి సీతక్క
అంగన్వాడీ కేంద్రాలకు మరింత నాణ్యమైన పోషకాహారం అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. ఆహార తయారీ కేంద్రాల నుంచి అంగన్వాడీ కేంద్రాలకు చేరే దాకా పటిష్ట పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు. మంగళవారం ఆమె సెక్రటేరియెట్ లో తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీలతో కలసి సంబంధిత శాఖాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ నుంచి అంగన్వాడీలకు సప్లై అవుతున్న ఆహార వస్తువుల నాణ్యతను మంత్రి సమీక్షించారు.
అంగన్ వాడీలకు సరఫరా అయ్యే ఆయిల్, పప్పులు, బాలమృతం, ఆహార పదార్థాల్లో నాణ్యతపై రాజీ పడొద్దన్నారు. చిన్నారులకు పోషకాలను అందిస్తేనే దేశం దృఢంగా ఉంటుందన్నారు. ఫుడ్స్ లో వినియోగిస్తున్న రా మెటిరియల్ ధరల సవరణ కోసం ఫైనాన్స్ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, తెలంగాణ ఫుడ్స్ అధికారులతో త్రిమెన్ కమిటీ వేస్తున్నట్లు సీతక్క ప్రకటించారు. నివేదిక ఆధారంగా ధరల సవరణపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సప్లయర్ల ఎంపికలో పారదర్శకత మరింత పెంచాలని అధికారులను ఆదేశించారు.