మార్కెట్ యార్డులకు కష్టకాలం

మార్కెట్ యార్డులకు కష్టకాలం

కరీంనగర్, వెలుగు: రైతులను, వ్యాపారులను ఒక్కచోట చేర్చి, పంటల కొనుగోళ్లు, అమ్మకాల్లో కీలకపాత్ర పోషిస్తూ వచ్చిన వ్యవసాయ మార్కెట్ యార్డులకు కష్టకాలం వచ్చింది. దళారుల బెడద తగ్గించేందుకు ప్రతి సీజన్లో ప్రభుత్వమే ఊరురా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేస్తుండడం, పత్తిని సైతం నేరుగా జిన్నింగ్ మిల్లులకే తరిలిస్తుండడంతో కొన్నేండ్లుగా ఈ ప్రధాన పంటలు మార్కెట్యార్డులకు రావడం దాదాపు తగ్గింది. తాజాగా మార్కెట్ కు వచ్చే ఏకైన ఇన్కం సోర్స్ అయిన సెస్ను కూడా కట్ చేయడంతో పాలకవర్గాలు, సిబ్బందికి జీతభత్యాల కోసం దిక్కులు చూడాల్సి వస్తోంది. దీంతో వీటి భారాన్ని తన భుజాల నుంచి దించుకునేందుకు రాష్ట్ర సర్కారు కొత్త ఆలోచన చేస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి.

271 వ్యవసాయ మార్కెట్లు..

తెలంగాణ వ్యాప్తంగా 271 వ్యవసాయ మార్కెట్లు ఉన్నాయి. వీటిలో చెప్పుకోదగ్గవి పదుల సంఖ్యలోనే ఉంటాయి. వరంగల్ జిల్లాలోని ఎనుమాముల, కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట, ఖమ్మం మార్కెట్ చాలా పెద్దవి. ఈ మార్కెట్ యార్డుల్లో పాలకవర్గ సభ్యులతో పాటు, ఆదాయాన్ని బట్టి స్టాఫ్‌‌ను తీసుకున్నారు. సెలక్షన్ గ్రేడ్, స్పెషల్ గ్రేడ్, గ్రేడ్ –-1, 2, 3 కార్యదర్శులనూ నియమించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట మార్కెట్లలో స్పెషల్ గ్రేడ్ కార్యదర్శులు పనిచేస్తున్నారు. ఇలాంటి చోట్ల కనీసం 40 మంది వరకు స్టాఫ్ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10వేల మంది ఉద్యోగులు, సిబ్బంది కేవలం వ్యవసాయ మార్కెట్లలోనే పనిచేస్తున్నారు.

ఇన్కం నిల్..

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయంతో వ్యవసాయ మార్కెట్లకు వచ్చే ఒక శాతం సెస్ రాకుండా పోయింది. ‘ఒకే దేశం.. ఒకే మార్కెట్’ పాలసీ వీటికి శాపంగా మారింది. ఇన్నాళ్లూ మార్కెట్ యార్డుల్లో క్రయ విక్రయాలు, వాటి పరిధిలో విక్రయాలకు సైతం ఒక శాతం సెస్ వచ్చేది. దీంతో పాటు వ్యవసాయ మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో నడిచే చెక్ పోస్టుల ద్వారా ఇన్కం సమకూరేది. ఈ క్రమంలో ఒక్కో మార్కెట్ కు ఏటా రూ. 6 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. ప్రస్తుతం ఆదాయం పూర్తిగా పడిపోవడంతో ఉద్యోగుల జీతభత్యాలు, పాలకవర్గాల ఖర్చులు వెళ్లదీయడం భారమవుతోంది.

మార్కెట్లకు పోతలేరు..

రాష్ట్రంలో ప్రధాన పంటలు వరి, పత్తి . ఈ పంటలను ప్రభుత్వం గ్రామ స్థాయిలోనే కొనే ఏర్పాట్లు చేస్తోంది. మెజారిటీ ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాల ద్వారా కొని, మిల్లులకు తరలిస్తున్నారు. ఇక పత్తిని జిన్నింగ్ మిల్లుల వద్దే కాంటా పెట్టి కొంటున్నారు. గతంలో మాదిరి రైతులు యార్డుకు తీసుకువస్తే ప్రైవేటు వ్యాపారులు వేలం పాడి కొనే పరిస్థితులు లేవు. ఇప్పటికీ అక్కడక్కడ ఈ పద్ధతి ఉన్నా రానున్న రోజుల్లో ఎక్కడా కనిపించదని వ్యాపారులు అంటున్నారు. ప్రస్తుతానికి పసుపు వల్ల నిజామాబాద్ మార్కెట్, మిర్చి కారణంగా వరంగల్ ఎనుమాముల, ఖమ్మం మార్కెట్, పత్తితో జమ్మికుంట లాంటి మార్కెట్లు నామమాత్రంగా నడుస్తున్నాయి.

ఉద్యోగుల భవిష్యత్?

పంట కొనుగోళ్లు, అమ్మకాలు తగ్గడం, ఆదాయ మార్గాలు లేకపోవడంతో వీటి భారాన్ని దించుకునేందుకు రాష్ట్రప్రభుత్వం కొత్త మార్గాలు వెతుకుతున్నట్లు తెలిసింది. యాక్టివ్ గా లేని, పెద్దగా ఆదాయం రాని చిన్న మార్కెట్ యార్డులను వాటి పరిధిలోని పెద్ద యార్డుల్లో విలీనం చేయడమో, లేదంటే రద్దు చేయడమో చేయాలనే ప్రపోజల్స్ వస్తున్నట్లు సమాచారం. ఈక్రమంలో ప్రభుత్వం ఎలాంటి పాలసీ తెస్తుంది? తమ ఉద్యోగాల పరిస్థితి ఏంటి? పెన్షనర్ల భవితవ్యం ఎలా ఉండబోతోంది? లాంటి ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. చిన్నయార్డుల్లోని ఉద్యోగులకు పెద్దయార్డుల్లోనో, ఇతర శాఖల్లోనో సర్దుబాటు చేస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి. మొత్తంమీద రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్లలో వేలాదిగా ఉన్న ఉద్యోగుల్లో తమ భవిష్యత్పై ఒకరకమైన ఆందోళన నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం