సస్పెండ్ అయినా డ్యూటీలోనే?

సస్పెండ్ అయినా డ్యూటీలోనే?
  • స్త్రీనిధి రికవరీలో ఫెయిల్ అయినందుకు సస్పెన్షన్​ వేటు
  • లోన్ల పంపిణీలో ఫ్రాడ్​ జరిగినట్లు ఆరోపణలు
  • వాటి లెక్క తేల్చేందుకు మళ్లీ ఆ ఆఫీసరే దిక్కు!

అలంపూర్, వెలుగుడీఆర్డీఏ శాఖలో పనిచేసే జిల్లా స్థాయి ఆఫీసర్​ సస్పెండ్ అయినప్పటికీ విధులు నిర్వహిస్తున్నారు. ఇందుకు ఉన్నతాధికారుల మద్దతు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్త్రీనిధి లోన్లను లబ్ధిదారుల పేరిట సిబ్బంది అనుయాయులకే కట్టబెట్టారని, రికవరీ విషయంలోనూ ఫ్రాడ్​ జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే రికవరీలో నిర్లక్ష్యం చేసినందుకు సస్పెండైన ఆఫీసరే.. వాటి లెక్కలు తేల్చే పనిలో ఉండడం గమనార్హం. జోగులాంబ గద్వాల జిల్లాలో డీఆర్డీఏలో జయన్న అనే వ్యక్తి ప్రాజెక్టు మేనేజర్ గా పనిచేస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయనను సెర్ప్​​ సీఈవో, ఐఏఎస్​ ఆఫీసర్​ సందీప్ కుమార్ సుల్తానియా గత నెల 24న సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీఐఎఫ్, కమ్యూనిటీ ఇన్వెస్ట్ ఫండ్, స్వర్ణ జయంతి స్వరాజ్ యోజన ఫండ్  నిధుల రికవరీలో అలసత్వం వహిస్తున్నారని, అంతేగాకుండా పైఆఫీసర్ల ఆదేశాలు పట్టించుకోవడం లేదనే ఆరోపణలతో చర్యలు తీసుకున్నారు. ఇదే విషయంలో జిల్లాలో 5 మంది సీసీలు కూడా సస్పెండ్ అయినట్లు విశ్వనీయ సమాచారం. 2001 నుంచి ఇప్పటివరకు ఆయా సంఘాల అభివృద్ధి కోసం మండల సమాఖ్య సంఘాలకు ఒక్కొక్క సంఘానికి రూ.కోటి చొప్పున ఫండ్​ ఏర్పాటు చేశారు. ఈ నిధుల నుంచి ఆయా సంఘాల్లోని మహిళలకు లోన్లు ఇచ్చారు. కానీ వాటి రికవరీ విషయంలో ఉద్యోగులు నిర్లక్ష్యం చేశారు.

లబ్ధిదారుల పేరిట లోన్లు మాయం..

కొందరు మండల స్థాయి ఆఫీసర్లు లబ్ధిదారుల పేర్లపై లోన్లు కాజేసినట్లు తెలుస్తోంది. రికవరీలను కూడా పక్కదారి పట్టించారనే ఆరోపణలూ ఉన్నాయి. దీంతో గ్రామాల్లోని మహిళలకు లోన్లు అందడం లేదు. ఇప్పటి వరకు జోగులాంబ గద్వాల జిల్లాలో సుమారు రూ.7 కోట్లు బకాయిలు వసూలు చేయాల్సి ఉండగా… కేవలం 4.51 శాతం మాత్రమే రికవరీ చేశారు. ప్రస్తుతం సీఈవో స్థాయి ఆఫీసర్​ పర్యవేక్షణతో డీఆర్డీఏ ఉద్యోగుల్లో గుబులు మొదలైంది. డీపీఎం స్థాయి ఆఫీసర్​ సస్పెన్షన్ తో మండల స్థాయి ఆఫీసర్లకు టెన్షన్​ పట్టుకుంది. ఉన్నతాధికారుల ఒత్తిడితో గ్రామాల్లోకి వసూళ్లకు వెళ్లిన సిబ్బందికి కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. కొంతమంది లబ్ధిదారులు తమకు లోన్లు ఇవ్వలేదని, మరికొందరు ఎప్పుడో లోన్లు చెల్లించామని చెబుతున్నారు. ఒక్క మానవపాడు మండలంలోనే సుమారు రూ.86 లక్షలు రికవరీ కావాల్సి ఉంది. ఇలా జిల్లాలోని ప్రతి మండలంలో రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షలకు పైగా బకాయిలు పెండింగ్​లో ఉన్నాయి. లెక్కలు తేలడం లేదని సిబ్బంది మల్లగుల్లాలు పడుతుండగా.. వాటిని తేల్చేందుకే సస్పెండ్ అయిన ఆఫీసరే అనధికారికంగా విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై డీపీఎం
జయన్నను వివరణ కోరగా.. సస్పెండ్ అయిన మాట వాస్తవమేనని, ఇంకా విధుల్లోకి చేరలేదని చెప్పారు. నాలుగు రోజుల క్రితం జరిగిన జిల్లా మీటింగ్​లో జేసీ శ్రీహర్ష అదేశాలతోనే లెక్కల్లో డౌట్స్ క్లియర్ చేసేందుకుఇటిక్యాల, మానవపాడు మండలాల్లనఆఫీసర్లతో సమావేశమైనట్లు తెలిపారు.