
- వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని తండ్రిని చంపిన కూతురు
- కల్లులో నిద్రమాత్రలు కలిపి తాగించి..
- ముఖంపై దిండుతో అదిమి చంపే యత్నం
- చున్నీతో చేతులు, కాళ్లు పట్టుకున్న భార్య, బిడ్డ
- అయినా చావకపోవడంతో ఛాతిపై పిడిగుద్దులు
- చివరకు మెడకు తాడుతో ఉరి బిగించి హత్య
- హైదరాబాద్‌లోని కవాడిగూడలో ఘటన
ఘట్కేసర్, వెలుగు: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఓ కూతురు తన తల్లి, ప్రియుడితో కలిసి కన్న తండ్రినే అత్యంత దారుణంగా హత్య చేసింది. కల్లులో నిద్రమాత్రలు కలిపి తాగించాక.. ముఖంపై దిండుతో అదిమిపెట్టి చంపేందుకు ప్రయత్నించారు.
అయినా.. చావకపోవడంతో ఛాతిపై పిడిగుద్దులు గుద్దారు. ఇంకా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా.. తాడుతో ఉరి బిగించి హత్య చేశారు. డెడ్‌బాడీని ఇంట్లోనే దాచిపెట్టి.. ప్రియుడితో కలిసి కూతరు సెకండ్ షో సినిమాకు వెళ్లింది. అర్ధరాత్రి దాటాక శవాన్ని తీసుకెళ్లి చెరువులో పడేశారు. డెడ్‌బాడీపై గాయాలు ఉండటంతో పోలీసుల దర్యాప్తులో దొరికిపోయారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని కవాడిగూడలో జరిగింది.
ముగ్గుబస్తీకి చెందిన వడ్లూరి లింగం (45) సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఇతని భార్య శారద జీహెచ్ఎంసీలో స్వీపర్. వీళ్ల కూతురు మనీషాకు పెండ్లయి ఇద్దరు పిల్లలున్నారు. ఈమె తన భర్త కంచర్ల రమేశ్‌ను వదిలి మల్కాజిగిరికి చెందిన మహ్మద్ జావేద్(24)తో కలిసి మౌలాలీలో ఉంటున్నది. ఇది తండ్రి లింగంకు నచ్చలేదు. అతను కల్లుకు బానిసకావడంతో రోజూ తాగి వచ్చేవాడు. కూతురు ఇంటికి వచ్చినప్పుడల్లా భార్య, బిడ్డలను వివాహేతర సంబంధం గురించి ప్రశ్నిస్తూ వేధించేవాడు. దీంతో తండ్రి తమకు అడ్డువస్తున్నాడని భావించిన కూతురు అతన్ని చంపాలని నిర్ణయించుకుంది. తల్లి, ప్రియుడికి విషయం చెప్పి ప్లాన్ వేసింది.
ఎంతకూ చావకపోవడంతో..
ఈ నెల 6న మధ్యాహ్నం లింగంకు ఇంట్లోనే కల్లులో నిద్రమాత్రలు కలిపి ఇచ్చారు. అయినా, లేచి తిరుగుతుండడంతో తల్లీ కూతుళ్లు మళ్లీ వైన్స్ కు వెళ్లి మద్యం తీసుకొచ్చారు. ఆ మందును మహ్మద్ జావేద్ .. లింగంతో కూర్చొని తాగించాడు. మద్యం మత్తులోకి జారుకోగానే జావేద్.. లింగం ముఖంపై దిండు అదిమిపెట్టగా చేతులను కూతురు, కాళ్లను భార్య చున్నీతో పట్టుకున్నారు.
అయినా, ఊపిరి ఆగకపోవడంతో జావేద్ అతడి ఛాతిపై పిడుగుద్దులు కురిపించాడు. అయినా, ప్రాణం ఉండడంతో మెడకు తాడుతో ఉరి బిగించి చంపేశారు. ప్రాణం పోయిందని నిర్ధారించుకున్న తర్వాత కూతురు తన ప్రియుడితో కలిసి సెకండ్‌షో సినిమాకు వెళ్లింది. అర్ధరాత్రి సినిమా పూర్తయ్యాక ఎదులాబాద్‌కు క్యాబ్ బుక్ చేశారు. డెడ్‌బాడీపై కల్లు, లిక్కర్ చల్లారు. క్యాబ్ డ్రైవర్ ఏమైందని ప్రశ్నించగా.. ఫుల్లుగా తాగి స్పృహ కోల్పోయాడని చెప్పారు. తల్లి, కూతురు డెడ్‌బాడీతో క్యాబ్‌లో ఎక్కగా, జావేద్ మాత్రం బైక్ పై బయలుదేరాడు. ఊరు రాకముందే ఎదులాబాద్ లక్ష్మీనారాయణ చెరువు దగ్గర ఆపారు.
ఎందుకని అడిగితే ‘మా నాన్న బాగా తాగాడు కదా..ఇలా వెళ్తే ఊరిలో పరువు పోతుంది.. ఇక్కడ కొంచం బట్టలు మార్చి.. లేపుకుని తీసుకువెళ్తాం’ అని చెప్పి పంపించారు. తర్వాత లింగం వేసుకున్న సెక్యూరిటీ గార్డు షర్ట్‌ను విప్పి అక్కడే పడేశారు. తర్వాత డెడ్‌బాడీని చెరువులో పడేసి వెళ్లిపోయారు. 7వ తేదీన ఉదయం చెరువులో శవం తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి శరీరంపై గాయాలుండటంతో పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేశారు.
ఎలా బయటపడిందంటే..
ముందు లింగం ఎవరో తెలియలేదు. తర్వాత చుట్టుపక్కల వెతకగా సెక్యూరిటీ గార్డు షర్ట్ కనిపించింది. దానిపై ఉన్న కంపెనీని సంప్రదిస్తే వారు చూసి లింగం అని గుర్తుపట్టారు. దీంతో వారి అడ్రస్ గుర్తించి ఇంటికి వెళ్లి భార్య, బిడ్డను విచారించారు. ‘అయ్యో మా నాన్న చనిపోయాడా? ఎంత పనైపోయింది’ అంటూ బిడ్డ పెద్దపెట్టున ఏడుస్తున్నట్టు నటించింది.
తల్లి కూడా ఏడుస్తున్నట్లు యాక్షన్ చేసింది. అక్కడికి లింగం ఎలా వెళ్లాడు? ఎందుకు వెళ్లాడు? అని ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. దీంతో కొందరు కుటుంబసభ్యులను విచారించారు. దాంతో పాటు చెరువు దగ్గర వారి సెల్‌ఫోన్ సిగ్నల్స్‌ను ట్రేస్చేయగా అంతకుముందు రోజు రాత్రి అక్కడే ఉన్నట్టు తేలింది. గట్టిగా ప్రశ్నించడంతో తామే చంపినట్టు ఒప్పుకున్నారు. దీంతో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పరుశురాం తెలిపారు.