ఇండియన్స్‌కి అమెరికా గుడ్ న్యూస్.. గ్రీన్ కార్డ్ నిబంధనల సరళీకరణ

ఇండియన్స్‌కి అమెరికా గుడ్ న్యూస్.. గ్రీన్ కార్డ్ నిబంధనల సరళీకరణ

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు కొద్ది రోజుల ముందు అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలో స్థిరపడాలనుకునే వారి కోసం జారీ చేసే గ్రీన్‌ కార్డు అర్హత నిబంధనలను సరళతరం చేసింది. ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (EAD) కోసం అర్హత ప్రమాణాలకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దీంతో అమెరికాలో స్థిరపడాలని ఆశిస్తున్న వేలాది మంది భారతీయులకు లబ్ధి చేకూరనుంది. 

ముఖ్యంగా భారతీయులు ఎక్కువగా లబ్ధిపొందనున్నారు. గ్రీన్ కార్డుల జారీ విషయంలో అమెరికా పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) జారీ చేసిన గైడ్ లైన్ భారతీయులకు ఎంతో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఏటా కొన్ని లక్షల మంది డాలర్ డ్రీమ్స్ తో భారతీయులు అమెరికా వెళ్తున్నారు. ఇప్పుడు వారంతా తమ స్థిరనివాసాన్ని సాకారం చేసుకునేలా గ్రీన్ కార్డు నిబంధనలు సరళీకరించారు. గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే కాకుండా రెన్యువల్ చేసుకునే వారికి కూడా నూతన మర్గదర్శకాలు వర్తింపచేసినట్లు అమెరికా వెల్లడించింది. 

ఉపాధి కోసం అమెరికా వెళ్లిన వలసదారులకు అమెరికాలో శాశ్వతంగా ఉండేందుకు గ్రీన్ కార్డు మంజూరు చేస్తుంటారు. ప్రతీ ఏటా సుమారుగా 1,40,000 గ్రీన్ కార్డులను జారీ చేస్తుంది. అయితే.. ఒక్కో దేశానికి నిర్ణీత కోటా ప్రకారమే వీటిని జారీ చేస్తుంటారు. మొత్తం దేశాల్లో ఒక్కో దేశానికి 7 శాతం మాత్రమే కేటాయించాలనేది ప్రస్తుత విధానం. ఈఏడీ అర్హత ఉన్నవారికి మాత్రమే ప్రస్తుతం గ్రీన్ కార్డు జారీ చేస్తున్నారు. తాజాగా ఈఏడీ నిబంధనల సడలించిన నేపత్యంలో అమెరికాలో సవాళ్లతో కూడిన పరిస్థితులు ఎదుర్కొంటున్న వ్యక్తులకు మద్దతిచ్చినట్లు అవుతుందని వలసదారుల హక్కుల కోసం పోరాడుతున్న న్యాయవాది అజయ్ భూటోరియా తెలిపారు. అమెరికాలో చట్టబద్ధంగా పనిచేసేవారి సంఖ్యను పెంపొందించేందుకు తాజా నిర్ణయం దోహదపడనుంది.

జూన్ 21 నుంచి భారత ప్రధాని నరేంద్రమోడీ అమెరికాలో పర్యటించనున్నారు. అక్కడి చట్టసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం-, వ్యాపారం, ద్వైపాక్షిక రంగాల్లో ఈ పర్యటన కీలకంగా ఉంటుందని ఇరు దేశాలు నాయకులు భావిస్తున్నారు. అమెరికా కాంగ్రెస్‌ సంయుక్త సమావేశంలోనూ మోడీ ప్రసంగించనున్నారు. మోడీకి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ దంపతులు, వైట్ హౌజులో విందు ఇవ్వనున్నారు.