
కుక్కల దాడిలో గాయపడ్డ ఓ వానరం మృతిచెందడంతో పారిశుధ్య కార్మికులు సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో ఓ వానరాన్ని కుక్కలు తీవ్రంగా గాయపరిచాయి. దీంతో గాయపడ్డ కోతి తీవ్ర అస్వస్థతకు గురైంది. మూడు రోజులు నరకయాతన అనుభవించింది. స్థానికులు దానికి పండ్లు ఇచ్చినా కూడా తినలేని స్థితిలో అచేతనంగా పడి ఉంది. చివరకు ప్రాణాలు విడిచింది వానరం. సుల్తానాబాద్ మున్సిపాలిటీల్లోని పారిశుధ్య కార్మికులు ఓదెలు, అనిల్ సాంప్రదాయబద్దంగా వానరానికి అంత్యక్రియలు నిర్వహించి, పూజలు చేశారు. మనుషుల్లో ఇంకా మానవత్వం ఉందని ఈ పారిశుధ్య కార్మికులు నిరూపించారు.