- రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల చొప్పున వసూలు చేసిన లేడీస్ గ్యాంగ్
- ఖమ్మం నగరంలో 100 మందికి పైగా బాధితులు పోలీసులకు ఫిర్యాదు
ఖమ్మం, ఖమ్మం టౌన్, వెలుగు: డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పిస్తామంటూ ఖమ్మం నగరంలో మహిళల ముఠా ఒకటి మోసాలకు పాల్పడింది. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారి నుంచి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల చొప్పున వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఐసీడీఎస్‌లో రిసోర్స్‌పర్సన్‌గా పని చేస్తున్న మహిళ, మరో అంగన్వాడీ టీచర్ ప్రధాన పాత్ర పోషించినట్టు సమాచారం. బాధితుల్లో కొంత మంది శుక్రవారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను కలిసి కార్పొరేషన్ పరిధిలోని టేకులపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పిస్తామని తమను మోసగించారని కంప్లయింట్ చేశారు. దీంతో ఆయన పోలీసులకు ఫోన్ చేసి బాధ్యులపై కేసు నమోదు చేయాలని, పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలని ఆదేశించారు.
బ్యాంకు లోన్లు కూడా ఇప్పిస్తమని..
డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతోనే కాకుండా, బ్యాంకు లోన్లు ఇప్పిస్తామని కూడా లేడీస్ ముఠా డబ్బులు వసూలు చేసినట్టు సమాచారం. రూ.5 లక్షలు లోన్ కావాలంటే రూ.60 వేలు, రూ.10 లక్షల లోన్ కావాలంటే రూ.1.20 లక్షల చొప్పున తీసుకున్నట్టు కొంత మంది బాధితులు శుక్రవారం ఖానాపురం హవేలి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. తమ లాంటి బాధితులు ఇంకా చాలామంది ఉన్నారని, ఒకటి రెండు రోజుల్లో మిగిలిన వాళ్లు కూడా బయటకు వస్తారని చెబుతున్నారు. ఐదుగురు మహిళలు ఈ మోసాలకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. ముందు డబ్బులు కట్టినవారికి టేకులపల్లిలో డబుల్ బెడ్రూమ్ఇండ్లు మంజూరైనట్టు ఫేక్‌పట్టాలు, ఫేక్ ఎలిజిబులిటీ లిస్ట్ ను చూపించడంతో..వారు తెలిసిన వాళ్లతో, బంధువులతో కూడా డబ్బులు కట్టించారు. ఆరు నెలలు దాటుతున్నా ఒక్కరికీ ఇల్లు ఇవ్వకపోవడం, డబ్బులు అడిగితే తప్పించుకు తిరుగుతుండడంతో మోసపోయినట్టు గుర్తించారు.
