రెండు తలల పాముల విక్రయం..పోలీసులు స్వాధీనం

రెండు తలల పాముల విక్రయం..పోలీసులు స్వాధీనం

నల్లమల అటవీ ప్రాంతం నుండి రెండు తలల  పాములు (Sand boa) తీసుకువచ్చి అధిక ధరలకు విక్రయించే ముఠాను సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పోలీసులు, మాదాపూర్‌ ఎస్‌వోటీ, సంగారెడ్డి అటవీశాఖ అధికారులు అరెస్ట్ చేశారు. మొత్తం తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి లక్షా 90వేల నగదు, 10 మొబైల్ ఫోన్లు, రెండు కార్లు, రెండు తలల పాములు రెండింటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో  పాములను విక్రయించిన ప్రధాన నిందితులు గోపాల్‌, ప్రసాద్‌తోపాటు యుగంధర్‌ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.

వివరాల్లోకి వెళ్తే..

రెండు తలల పామును ఇంట్లో పెట్టుకుంటే అదృష్టమని, కుభేరులు అవుతారని కొందరు నమ్ముతారు. అలాగే ఎయిడ్స్‌ నివారణకు మందుల తయారీలో వినియోగిస్తారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. దీంతో వీటికి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. అయితే దీన్ని క్యాష్ చేసుకుందామని భావించిన సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పరిధిలోని జ్యోతినగర్‌కు చెందిన చిన్నోల్ల మాణిక్‌రెడ్డి రెండు తలల పాముల కోసం చిత్తూరుకు చెందిన యుగంధర్‌ను సంప్రదించాడు. యుగంధర్‌ చిత్తూరుకు చెందిన చంద్రశేఖర్‌, అతడి స్నేహితులైన నవీన్‌ తమిళనాడుకు చెందిన భాస్కర్‌ కు విషయాన్ని తెలియజేశాడు. వీరందరూ కలిసి పాముల కోసం  చిత్తూరుకు చెందిన ప్రసాద్‌, గోపాల్‌ను అడిగారు. ప్రసా ద్‌, గోపాల్‌లు నల్లమల అడవుల్లోకి రమ్మని చెప్పడంతో .. చంద్రశేఖర్‌, నవీన్‌, భాస్క ర్‌ మార్చి 15న నల్లమలకు వెళ్లారు. అక్కడ రెండు తలల పాములు రెండింటిని  కొనుగోలు చేశారు. వాటిని అధిక ధరకు విక్రయించేందుకు మాణిక్‌రెడ్డి వద్దకు తెచ్చారు. మాణిక్‌రెడ్డి పాముల వీడియోలను కర్ణాటకలోని గుల్బర్గా ప్రాంతానికి చెందిన ఎండీ భాష, రమేశ్‌, రఘువీర్‌, బిజాపూర్‌కు చెందిన అంబోర్‌ విజయ్‌కుమార్‌, షేక్‌ సికిందర్‌కు పంపాడు. ఆ పాములను కొనుగోలు చేసేందుకు వీరందరూ నగరానికి వచ్చారు. 

పక్కా సమాచారంతో...

రెండు తలల పాముల కొనుగోలు వ్యవహారంపై పక్కా సమాచారం అందుకున్న రామచంద్రాపురం పోలీసులు, మాదాపూర్‌ ఎస్‌వోటీ పోలీసులు, సంగారెడ్డి అటవీశాఖ సిబ్బందితో కలిసి  మాణిక్‌రెడ్డి ఇంటిపై దాడి చేశారు. అతని వద్ద నుంచి రెండు పాములు,రెండు కార్లు, 10 సెల్‌ఫోన్లు, వేయింగ్‌ మిషన్‌, టేప్‌తోపాటు రూ. 1.90 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. 

పాము ఉంటే లక్ష్మీ వస్తుందా..?

రెండు తలల పామును ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీ వస్తుందన్న మూఢనమ్మకాలతో కొనుగోలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు.  రెండు తలల పాము ఇంట్లో ఉంటే కుబేరులవుతారన్న ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు.  పాముల స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు తెలిస్తే  సమాచారం ఇవ్వాలని కోరారు. అంతరించిపోతున్న పాముల్లో రెండు తలల పాము ఒక రకమైందని...అన్ని పాముల్లాగ  ఎక్కువగా కనిపించకపోవడంతో  క్యాష్ చేసుకునేందుకు వీటిని పట్టుకొచ్చి  అమ్ముతున్నారని తెలిపారు. ఇలాంటివి మూఢనమ్మకాలతో ఏమి లాభం ఉండదని ప్రజలు గుర్తించాలన్నారు.