V6 News

భారతీయ సంస్కృతికి అరుదైన గౌరవం: UNESCO జాబితాలో దీపావళి!

భారతీయ సంస్కృతికి అరుదైన గౌరవం: UNESCO జాబితాలో దీపావళి!

భారతీయ సంస్కృతికి, వారసత్వానికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. వెలుగుల పండుగ దీపావళిని యునెస్కో తన సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చింది. భారతీయ సంస్కృతి గొప్పదనాన్ని, ప్రపంచవ్యాప్త ప్రాముఖ్యతను ఈ గుర్తింపు మరోసారి చాటిచెప్పింది. అయితే దీనిపై ప్రధాని మోడీ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఇది మన నాగరికతకు ఆత్మ వంటిదని తన ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు ప్రధాని మోడీ.

యునెస్కో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన సాంస్కృతిక అంశాలను గుర్తించి, వాటి పరిరక్షణకు కృషి చేస్తుంది. ఈ జాబితాలో ఒక అంశం చేర్చబడటం అంటే.. దానిని ప్రపంచ వారసత్వంగా పరిగణించి, భవిష్యత్ తరాల కోసం కాపాడాలని అంతర్జాతీయ సమాజం గుర్తించినట్లు లెక్క. అందుకే భారతీయులు పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా జరుపుకునే దీపావళి యునెస్కో జాబితాలో చేరటం గర్వంగా ఫీలవుతున్నారు. 

దీపావళి ఎందుకు ప్రత్యేకమైంది?
దీపావళి కేవలం పండుగ మాత్రమే కాదు.. ఇది సామాజిక ఐక్యతకు, ఆధ్యాత్మిక విలువలకు, చారిత్రక సంప్రదాయాలకు ప్రతీకగా జరుపుకుంటారు భారతీయులు. ముఖ్యంగా ఉత్తర భారతంలో అయోధ్యకు శ్రీరాముడు తిరిగి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ పండుగను జరుపుకుంటారు. 

Also read:- ఆన్‌లైన్‌లో హెల్త్ ఇన్సూరెన్స్ కొంటున్నారా? ఈ పొరపాట్లు చేయకండి!

అలాగే చెడుపై మంచి సాధించిన విజయాన్ని, అజ్ఞానంపై జ్ఞానం పొందిన ఆధిపత్యాన్ని దీపావళి దీపాలు సూచిస్తాయి. కేవలం హిందువులే కాకుండా జైనులు, సిక్కులతో పాటు మరికొన్ని మతాల వారు కూడా ఈ పండుగను తమదైన సంప్రదాయాలతో జరుపుకుంటారు. ఇది ప్రాంతీయ, మతపరమైన భేదాలు లేకుండా అందరినీ ఏకం చేసే పండుగ.దీపావళికి బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, ఇళ్లు శుభ్రం చేసుకోవడం, కొత్త వస్తువులు కొనడం వంటి పనుల ద్వారా ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతం లభిస్తుంది. యునెస్కో ఇచ్చిన ఈ గౌరవం పట్ల భారత ప్రభుత్వం, సాంస్కృతిక శాఖ తమ హర్షాన్ని వ్యక్తం చేశాయి.