ఈరోజుల్లో ఇంటర్నెట్ నుంచి తమ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను కొనడం చాలా సులభమైంది. ఇంట్లో కూర్చొని వేర్వేరు ప్లాన్‌లను, వాటి ధరలను, కవరేజీని సులభంగా పోల్చుకునే వీలు ఉండటమే ఈ విధానం పాపులర్ అవటానికి ప్రధాన కారణంగా మారింది. పైగా ఇది పారదర్శకతను కూడా పెంచిందని బజాజ్ క్యాపిటల్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ లిమిటెడ్ సీఈవో వెంకటేశ్ నాయుడు అన్నారు.
ఏజెంట్ లేదా బ్రోకర్ ఒత్తిడి లేకుండా ఆన్‌లైన్‌లో పాలసీ కొనటం సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ.. కొన్నిసార్లు ఇది సమస్యలను సృష్టిస్తుంది. వెయిటింగ్ పీరియడ్స్, సబ్-లిమిట్స్ వంటివి ఆన్‌లైన్‌లో కొనేవారు సొంతంగా అర్థం చేసుకోవాలి. ఆన్‌లైన్ లో కొనేటప్పుడు ఇతరుల సపోర్ట్ ఉండదు కాబట్టి అన్ని అంశాలు అర్థం చేసుకోవటం చాలా ముఖ్యమైనదిగా నిపుణులు సూచిస్తున్నారు.
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఆన్‌లైన్‌లో కొనేటప్పుడు సాధారణ తప్పులు:
* చాలామంది కవరేజీని పట్టించుకోకుండా తక్కువ ప్రీమియం ఉన్న పాలసీని ఎంచుకుంటారు. ఈ చౌక పాలసీల్లో రూమ్ రెంట్ పరిమితులు, కో-పేమెంట్స్ వంటి కఠినమైన నిబంధనలు ఉండవచ్చు.
* పాలసీ కొనేటప్పుడు ఆరోగ్యం గురించి పూర్తిగా నిజం చెప్పడం ముఖ్యం. గతంలో వచ్చిన అనారోగ్యాలు, తీసుకున్న మందులు, శస్త్రచికిత్సలు, ధూమపానం వంటి అలవాట్లను తప్పకుండా వెల్లడించాలి. చాలా క్లెయిమ్ సమస్యలు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు సమాచారాన్ని సరిగ్గా షేర్ చేయకపోవటం వల్లనే వస్తుంటాయి.
* చాలామంది కస్టమర్‌లు వెయిటింగ్ పీరియడ్స్, నిర్దిష్ట వ్యాధులపై ఉన్న సబ్-లిమిట్స్, నో క్లెయిమ్ బోనస్ వంటి కీలకమైన నిబంధనలను చదవరు. దీనివల్ల క్లెయిమ్ సమయంలో ఊహించని ఖర్చులు పెరగొచ్చు.
ALSO READ : 2026లో షార్ట్‌కట్స్ వద్దు: కొత్తగా క్రిప్టోల్లో ఇన్వెస్ట్ చేసేవాళ్లకు టిప్స్ ఇవే..
క్లెయిమ్‌లు సజావుగా రావాలంటే..
1. ట్రీట్మెంట్ సమయంలో మీ పాలసీ అనుమతించిన రూమ్ కేటగిరీని మాత్రమే ఎంచుకోవాలి. అధిక ధర గల గది తీసుకుంటే.. ఇతర ఖర్చులపై కూడా తగ్గింపులు (Proportionate Deductions) వర్తించవచ్చు.
2. ఆసుపత్రిలో చేరే ముందు, అది మీ ఇన్సూరెన్స్ సంస్థ క్యాష్‌లెస్ నెట్‌వర్క్‌లో ఉందో లేదో చెక్ చేయండి.
3. అధిక వైద్య ఖర్చుల కోసం టాప్-అప్ లేదా సూపర్ టాప్-అప్ ప్లాన్‌లు మంచివి, కానీ వాటిలో ఉన్న డిడక్టబుల్స్ గురించి ముందుగానే పూర్తిగా అర్థం చేసుకోవాలి.
4. ప్లాన్ చేసిన చికిత్సలకు 3-5 రోజుల ముందు ప్రీ-ఆథరైజేషన్ ప్రక్రియ మొదలు పెట్టాలి. అత్యవసరమైతే మాత్రం 24 గంటల్లోగా ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయాలి.

