భార్యతో కలిసి పారిపోయిన ప్రభుత్వ ఉద్యోగి

భార్యతో కలిసి పారిపోయిన ప్రభుత్వ ఉద్యోగి

హనుమకొండ జిల్లా: చేసేది ప్రభుత్వ ఉద్యోగం ... ఇంకా సంపాదించాలన్న ఆశతో మోసాలకు ప్లాన్ వేశాడు.. తక్కువ ధరకే ప్లాట్లు ఇస్తామని నమ్మించి 40 కోట్లు వసూలు చేశాడు. అర్ధరాత్రి చెప్పా పెట్టకుండా భార్యతో పాటు పరారయ్యాడు. 

వెంచర్ ఏర్పాటు చేస్తున్నామని బంధువులు, తెలిసిన వాళ్ల దగ్గరి నుంచి కోట్లల్లో డబ్బులు వసూలు చేసి పరాయ్యారు హన్మకొండకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి దంపతులు. టీచర్స్ కాలనీకి చెందిన ప్రమోద్ కుమార్ ఏటూరునాగారంలో ఐటీఐ ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నారు. ప్రమోద్ కుమార్ ఆయన భార్య సునీత ఇద్దరు కలిసి వెంచర్ ఏర్పాటు చేస్తున్నామని బంధువులు, స్నేహితులు, ఇంటి పక్కవాళ్లు, తోటి ఉద్యోగులు నుంచి డబ్బులు వసూలు చేశారు. ముందే డబ్బులు ఇచ్చి ప్లాట్లు బుక్ చేసుకుంటే తక్కువ ధరకు ఇస్తామని అందరినీ నమ్మించారు. మొత్తం 40 మందికి పైగా  వ్యక్తుల నుంచి 40 కోట్ల వరకు వసూలు చేశారు.  
ముందుగా యాదాద్రి దగ్గర ప్లాట్లు ఇస్తామని జనానికి చెప్పారు ప్రమోద్ కుమార్ దంపతులు. డబ్బులు ఇచ్చిన వాళ్లు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలని అడగటంతో ప్లాట్స్ చేయడం పూర్తి కాలేదని చెప్పారు. ఆ తర్వాత జనగామ జిల్లా రఘునాదపల్లి మండలం కోమల్ల దగ్గర  వెంచర్ చేస్తున్నామన్నారు. ప్లాట్లు ఇంకా ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తారని కస్టమర్లు నిలదీయడంతో ఒకరోజు రాత్రి ఇంటికి తాళం వేసి, ఇద్దరూ పరారయ్యారు. ఉద్యోగానికి సెలవులు పెట్టి వెళ్లిపోయారు ప్రమోద్ కుమార్. దీంతో బాధితులు సుబేదారి  పోలీసులకు పిర్యాదు చేశారు. 

రోడ్డు పక్కన ప్లాట్ అని ఆశపెట్టి మోసం..

మెయిన్ రోడ్డుపక్కన ప్లాటు ఇస్తామని ఆశపెట్టి మోసం చేశాడని.. నమ్మించి డబ్బులు తీసుకుని మోసం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమోద్ కుమార్ వాళ్ల  బంధువులు లండన్ నుంచి ఫోన్ చేసి,  డబ్బులు ఇస్తామని చెప్పారని అయితే ఇప్పటివరకు డబ్బులు ఇవ్వకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని స్వప్న అనే బాధితురాలు వాపోయారు. 

పరిస్థితులన్నీ తలకిందులయ్యాయి

ఎన్నో కష్టాలు పడి సంపాదించుకున్న డబ్బులతో ప్లాటు కొంటే భవిష్యత్ కు ఉపయోగపడుతుంని భావించామంటున్నారు హన్మకొండ టీచర్స్ కాలనీకి చెందిన రష్మి,  సునీత అనే బాధితులు. డబ్బులు తీసుకుని మోసం చేయడంతో ఇప్పుడు తమ పరిస్థితులన్నీ తలకిందలయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మించి మోసం చేసిన  ప్రమోద్ కుమార్ ఆయన భార్య సునితపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలంటున్నారు బాధితులు. బాధితుల ఫిర్యాదుతో ప్రమోద్ కుమార్ తో పాటు ఆయన భార్యపై కేసు నమోదు చేశారు పోలీసులు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.