
గువాహతి: దీప్తి శర్మ (53; 3/54), అమన్‌జోత్ కౌర్ (57; 1/67) ఆల్‌రౌండ్ పెర్ఫామెన్స్‌తో సత్తా చాటడంతో విమెన్స్ వన్డే వరల్డ్ కప్‌ను టీమిండియా అద్భుత విజయంతో ఆరంభించింది. మంగళవారం (సెప్టెంబర్ 30) జరిగిన టోర్నీ తొలి మ్యాచ్‌లో ఇండియా డక్‌వర్త్ పద్ధతిలో 59 రన్స్ తేడాతో శ్రీలంకను చిత్తుగా ఓడించింది.
వర్షం అంతరాయంతో 47 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో తొలుత ఇండియా 269/8 స్కోరు చేసింది. హర్లీన్ డియోల్ (48), ప్రతీక రావల్ (37) రాణించినా వైస్ కెప్టెన్ మంధాన (8), జెమీమా (8), కెప్టెన్ హర్మన్ (21) నిరాశ పరచడంతో ఓ దశలో 124/6తో కష్టాల్లో పడ్డ జట్టును ఆల్‌రౌండర్లు దీప్తి, అమన్ ఆదుకున్నారు. లంక ఫీల్డింగ్ తప్పిదాలను సొమ్ము చేసుకుంటూ ఏడో వికెట్‌కు 103 రన్స్ జోడించి మంచి స్కోరు అందించారు.
చివరిలో స్నేహ్ రాణా (28 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. ఇనోవా 4 వికెట్లు పడగొట్టింది. అనంతరం ఛేజింగ్‌లో లంక ఓవర్లలో 45.4 ఓవర్లలో 211 రన్స్‌కే ఆలౌలైంది. కెప్టెన్ చమరి ఆటపట్టు (43), నీలాక్షికా సిల్వ (35), హర్షిత (29) పోరాడినా పలితం లేకపోయింది. దీప్తి మూడు, స్నేహ్ రాణా, శ్రీచరణి రెండు వికెట్లతో దెబ్బకొట్టారు. దీప్తికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. బుధవారం జరిగే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా–న్యూజిలాండ్ పోటీ పడతాయి.
జుబిన్‌కు నివాళులర్పిస్తూ.. ప్రారంభోత్సవం
ఇటీవల మరణించిన అస్సాం లెజెండరీ సింగర్ జుబిన్ గార్గ్‌కు ఘన నివాళులర్పిస్తూ టోర్నీ ఓపెనింగ్ సెర్మనీ నిర్వహించారు. ఇన్నింగ్స్ బ్రేక్ మధ్యలో బాలీవుడ్ టాప్ సింగర్ శ్రేయా ఘోషల్ తన 13 నిమిషాల పెర్ఫామెన్స్‌తో ఫ్యాన్స్‌ను కట్టిపడేసింది. ఈ సందర్భంగా మిథాలీ రాజ్ సహా పలువురు లెజెండరీ విమెన్ క్రికెటర్లను బీసీసీఐ సన్మానించింది.