బిర్యానీ ఉడకలేదన్నందుకు కస్టమర్లపై కట్టెలతో దాడి

బిర్యానీ ఉడకలేదన్నందుకు కస్టమర్లపై కట్టెలతో దాడి
  •     హోటల్ సిబ్బంది ఆరుగురు అరెస్ట్
  •     హైదరాబాద్​లోని అబిడ్స్​లో ఘటన

బషీర్ బాగ్, వెలుగు :  బిర్యానీ సరిగ్గా ఉడకలేదని నిలదీసిన కస్టమర్లపై ఓ హోటల్ సిబ్బంది దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్​లోని అబిడ్స్ లో జరిగింది. న్యూ ఇయర్ సందర్భంగా 31వ తేదీ అర్ధరాత్రి ధూల్​పేట్​కు చెందిన కొందరు కుటుంబసభ్యులతో  కలిసి అబిడ్స్ జీపీవో వెనుక ఉన్న గ్రాండ్ హోటల్​కు వెళ్లారు. మటన్ బిర్యానీ ఆర్డర్ ఇవ్వగా వెయిటర్ వడ్డించాడు. అయితే బిర్యానీ సరిగ్గా ఉడకలేదని తమకు డిస్కౌంట్ ఇవ్వాలని వెయిటర్​ను ఫ్యామిలీ మెంబర్స్ కోరారు.  దీంతో కస్టమర్లకు, హోటల్ సిబ్బందికి మధ్య వాగ్వావాదం జరిగింది.

మొదట ఓ కస్టమర్ వెయిటర్​పై దాడి చేశాడు. దాంతో వెయిటర్స్  అందరూ కలిసి కస్టమర్లపై ఎదురు దాడికి దిగారు. హోటల్​లో ఉన్న కట్టెలు, పైపులు, వంట సామగ్రితో ఇష్టమొచ్చినట్లు కొట్టారు. ఈ ఘటనలో  మహిళలతో పాటు పలువురికి గాయాలయ్యాయి. దాంతో బాధితులు  హోటల్​పై, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. నిబంధనలు పాటించని హోటల్​ను మూసి వేయాలని, తమకు న్యాయం చేయాలని కోరుతూ అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఉడకని బిర్యాని వడ్డించడంతో పాటు ఇదేమని ప్రశ్నించినందుకు దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా 9 మంది దాడికి పాల్పడినట్లు గుర్తించారు. అందులో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని.. త్వరలో అరెస్ట్ చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.