ఆత్మహత్య చేసుకున్న సలాం కుటుంబంలోని యువతికి ఉద్యోగం

ఆత్మహత్య చేసుకున్న సలాం కుటుంబంలోని యువతికి ఉద్యోగం

కర్నూలు: పోలీసుల వేధింపులు భరించలేక నంద్యాల సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సలాం కుటుంబ సభ్యులలోని ఒక యువతికి ఉద్యోగ నిమయాకపత్రాన్ని జిల్లా కలెక్టర్ వీరపాండియన్ అందజేశారు. పశు సంవర్ధకశాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం కల్పించారు. రెండు నెలల క్రితం పాణ్యం సమీపంలోని కౌలూరు వద్ద అబ్దుల్ సలాం తన భార్య.. ఇద్దరు పిల్లలతో కలసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల వేధింపులే కారణమని ఆలస్యంగా సెల్ఫీ వీడియో బయటపడడం రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపింది. అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం చేయాలని ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది. అయితే  ప్రభుత్వ సహాయాన్ని సలాం కుటుంబీకులు తొలుత వ్యతిరేకించినా.. ఆ తర్వాత మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి చొరవతో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి తదితరులు స్వయంగా కలసి నచ్చ చెప్పడంతో మెత్తపడ్డారు. ఏదైనా ఉద్యోగ అవకాశం కల్పించాలన్న కుటుంబ సభ్యుల కోరికను నెరవేర్చారు.

ఇవాళ ఉదయం జిల్లా కలెక్టర్ వీరపాండియన్ నంద్యాల పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని 26, 27, 29 మరియు 30 వార్డులలో సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తుండగా.. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సలాం కుటుంబ సభ్యులను కలిశారు. నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ జెడి రమణయ్యలతో కలసి ఆత్మహత్య చేసుకున్న సలాం కుటుంబ సభ్యులలో ఒకరైన రేష్మ కు పశుసంవర్ధక శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా నియామక పత్రాన్ని జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ అందజేశారు.