గంటకు 63 వేల కి.మీ. స్పీడ్​తో దూసుకొస్తున్న ‘ప్లానెట్​ కిల్లర్​’

గంటకు 63 వేల కి.మీ. స్పీడ్​తో దూసుకొస్తున్న ‘ప్లానెట్​ కిల్లర్​’
  • గంటకు 63 వేల కి.మీ. స్పీడ్​తో దూసుకొస్తున్న ‘ప్లానెట్​ కిల్లర్​’
  • ఇయ్యాల భూమిని దాటిపోనున్న కిలోమీటర్ సైజ్ ఆస్టరాయిడ్
  • ప్రమాదమేమీ లేదన్న నాసా

న్యూఢిల్లీ : కిలోమీటర్​కు పైగా సైజ్ ఉన్న ఓ పెద్ద ఆస్టరాయిడ్ గంటకు 63,180 కిలోమీటర్ల స్పీడ్ తో అంతరిక్షంలో దూసుకొస్తోంది. ‘2012కేవై3’ అనే ఆ ఆస్టరాయిడ్ గురువారం భూమికి 47 లక్షల 84 వేల 139 కిలోమీటర్ల దూరం నుంచి వేగంగా వెళ్లిపోనుందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రకటించింది.

ప్రస్తుతానికి దీని వల్ల భూమికి ఎలాంటి ముప్పులేదని వెల్లడించింది. ఆస్టరాయిడ్ 2012కేవై3ని 2012లో తొలిసారిగా కనుగొన్నారు. ఇది సూర్యుడిని ప్రతి నాలుగేండ్లకు ఒకసారి చుట్టి వస్తోంది. దీనిని నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ గా నాసా గుర్తించింది. సూర్యుడికి, భూమికి మధ్య ఉన్న దూరం (15 కోట్ల కిలోమీటర్లు) కంటే 1.3 రెట్లు తక్కువ దూరంలో నుంచి ప్రయాణించే ఆస్టరాయిడ్లను నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ గా గుర్తిస్తారు.

మరోవైపు కిలోమీటర్ కు పైగా సైజ్ ఉన్నందున ఇది భూమిని ఢీకొంటే పెను ముప్పు సంభవించే అవకాశం ఉంటుంది. అందుకే దీనిని ‘ప్లానెట్ కిల్లర్’గా పిలుస్తున్నారు. చివరిసారిగా ఈ ఆస్టరాయిడ్ 2019 జనవరిలో భూమికి సమీపంలోని కక్ష్య గుండా ప్రయాణించింది. అప్పుడు 6.82 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లిపోయిన ఈ గ్రహశకలం ఇప్పుడు 47.84 లక్షల కిలోమీటర్ల చేరువలోని కక్ష్య ద్వారా దూసుకెళ్తోంది. ఇది మళ్లీ 2025లో భూమికి సమీపంలోకి రానుందని నాసా పేర్కొంది.