- సౌత్ చైనా సీ నుంచి గల్ఫ్ దిశగా కదులుతున్న బలగాలు
- ఇరాన్‌పై అమెరికా దాడికి సిద్ధమైందంటూ ఊహాగానాలు.. ఇజ్రాయెల్ హైఅలర్ట్
వాషింగ్టన్: ఇరాన్ వైపుగా అమెరికా భారీగా బలగాలను తరలిస్తోంది. శక్తిమంతమైన యుద్ధ విమాన వాహక నౌక ‘యూఎస్ఎస్ అబ్రహాం లింకన్’తోపాటు గైడెడ్ మిసైల్స్ తో కూడిన డెస్ట్రాయర్ నౌకలు ఇరాన్ దిశగా కదులుతున్నాయి. మొన్నటివరకూ దక్షిణ చైనా సముద్రంలో ఉన్న ఈ యుద్ధనౌకలు భారీ సంఖ్యలో ఫైటర్ జెట్ లతో సహా గల్ఫ్ వైపు ప్రయాణిస్తున్నాయని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. నిరసనకారులను కాల్చి చంపుతున్న ఇరాన్‌పై సైనిక చర్య చేపడతామని చెప్తూ వచ్చిన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ బుధవారం దావోస్ వేదికగా దీనిపై స్పందించారు.
తాను సైనిక చర్య చేపడతానని హెచ్చరించడంతో ఇరాన్ 840 మంది నిరసనకారులకు మరణశిక్షలను నిలిపివేసిందన్నారు. అందుకే ఆ దేశంపై సైనిక చర్య అవసరం లేదని, చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కానీ ఆ మరుసటి రోజే ఇరాన్ వైపుగా అమెరికా యుద్ధనౌకలు కదులుతున్నాయని చెప్పారు. ఇరాన్‌పై దాడి చేయాలని అనుకోవడంలేదని, కానీ ఆ దేశంలో పరిస్థితిని గమనిస్తున్నామని చెప్పుకొచ్చారు. కాగా, యూఎస్ఎస్ అబ్రహాం లింకన్ తోపాటు ఇతర యుద్ధనౌకలు కొద్దిరోజుల్లోనే గల్ఫ్ ప్రాంతానికి చేరుకోనున్నాయని అంతర్జాతీయ మీడియా సంస్థలు తెలిపాయి. ఒకవేళ ఇరాన్‌పై అమెరికా దాడి చేస్తే.. ఇరాన్ కూడా అమెరికా బలగాలతోపాటు ఇజ్రాయెల్ పైనా ప్రతిదాడులకు దిగే అవకాశం ఉంటుంది. దీంతో ఇజ్రాయెల్ హైఅలర్ట్ అయింది.
నాటో దేశాలపై ట్రంప్ కామెంట్లతో దుమారం
అమెరికాపై 9/11 (2001) టెర్రరిస్ట్ అటాక్ తర్వాత అఫ్గానిస్తాన్ పై అమెరికా ప్రారంభించిన సైనిక చర్య సమయంలో నాటో దేశాలు పోరాటంలో ముందు వరుసలో నిలవలేదంటూ యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన తాజా కామెంట్లతో దుమారం రేగింది. ఇది తమను అవమానించడమేనని ఆయా దేశాలు మండిపడ్డాయి. గురువారం దావోస్‌లో ‘ఫాక్స్ న్యూస్’ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘అఫ్గానిస్తాన్ లో అమెరికా సేనలు మాత్రమే ముందు వరుసలో ఉండి పోరాటం చేశాయి. మిగతా నాటో దేశాలన్నీ తమ బలగాలను ఫ్రంట్ లైన్‌కు వెనకే ఉంచాయి. వాళ్లు తమ బలగాలను అఫ్గాన్ కు పంపించామని, అది చేశాం, ఇది చేశామని చెప్తుంటారు. కానీ వాళ్ల బలగాలు కొంత వెనకే ఉండిపోయాయి” అని ట్రంప్ అన్నారు.
