- గోవా నైట్ క్లబ్లో అగ్ని ప్రమాదం 25 మంది మృతి
- ప్రమాదానికి గల కారణాలపై భిన్నాభిప్రాయాలు
- గ్యాస్ సిలిండర్ పేలినట్లు అనుమానం
- డ్యాన్స్ రూమ్‌లో మంటలు
- చెలరేగాయంటున్న ప్రత్యక్ష సాక్షులు
- తాటాకుల కారణంగా వేగంగా మంటల వ్యాప్తి
- బయటికెళ్లేందుకు ప్రయత్నించిన ప్రేక్షకులు
- ఇరుకైన ఎంట్రీ, ఎగ్జిట్‌తో గందరగోళం
- చనిపోయినవాళ్లలో 14 మంది క్లబ్ సిబ్బంది
- సంతాపం ప్రకటించిన రాష్ట్రపతి, ప్రధాని
పణజి: నార్త్ గోవా అర్పోరా గ్రామంలోని ‘బిర్చ్ బై రోమియో లేన్’ నైట్‌క్లబ్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు సహా 25 మంది చనిపోయారు. సిలిండర్ పేలడం వల్లే ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని రాష్ట్ర పోలీసులు తొలుత పేర్కొన్నప్పటికీ.. డ్యాన్సింగ్ రూమ్‌లో మంటలు చెలరేగినట్లు ప్రత్యక్షసాక్షులు చెప్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు డ్యాన్స్ ఫ్లోర్‌పై సుమారు 100 మందికి పైగా ప్రేక్షకులు ఉన్నారు.
ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గందరగోళం ఏర్పడింది. పర్యాటకులు ప్రాణభయంతో పరుగులు తీశారు. కొందరు ఇరుకుగా ఉన్న ఎగ్జిట్ డోర్ వైపు వెళ్లగా.. మరికొందరు కిచెన్‌లోకి వెళ్లి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ దుర్ఘటనలో ముగ్గురు నిప్పంటుకుని కాలిన గాయాలతో చనిపోయారని, మిగతా వారంతా దట్టమైన పొగ కారణంగా ఊపిరాడక మృతి చెందారని అధికారులు తెలిపారు. 50 మంది వరకు గాయపడ్డారు. మృతుల్లో నలుగురు పర్యాటకులు, 14 మంది క్లబ్ సిబ్బంది ఉన్నట్లు గోవా సీఎం ప్రమోద్ సావంత్ ప్రకటించారు. మిగతా ఏడుగురి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. మృతుల్లో జార్ఖండ్, అస్సాం, తదితర రాష్ట్రాలకు చెందినవాళ్లే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తున్నది. పోస్టుమార్టం కోసం డెడ్‌బాడీలను గోవా మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు తరలించారు. ఈ దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.
క్లబ్బుకు దూరంగానే ఆగిన ఫైరింజన్లు
క్లబ్‌లోని కిచెన్ ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే అగ్నిప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. మొదటి అంతస్తు సీలింగ్ నుంచి మొదట మంటలు వచ్చాయని, ఆ సమయంలో ఒక ప్రోగ్రామ్ జరుగుతున్నదని మరికొందరు అంటున్నారు. అగ్ని ప్రమాదానికి కారణం ఏంటనేదానిపై స్పష్టత రావాల్సి ఉన్నది. అయితే, క్లబ్ నిర్వాహకులు కస్టమర్ల సేఫ్టీ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం కానీ, ఏర్పాట్లు చేయడం కానీ చేయలేదని తెలుస్తోంది. బ్యాక్ వాటర్స్ సమీపంలో ఉన్న ఈ క్లబ్చుట్టూ నీళ్లు ఉండడం, ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు ఇరుకుగా ఉండడంతో ఫైరింజన్లు కబ్ల్ కు సమీపంలోకి వెళ్లలేకపోయాయని, దాదాపు 400 మీటర్ల దూరంలోనే వాటిని నిలపాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగిందని సీనియర్ ఫైర్ ఆఫీసర్ తెలిపారు. క్లబ్ నిర్వాహకుల మధ్య విభేదాలు నడుస్తున్నాయని అర్పోరా గ్రామ సర్పంచ్ రోషన్ రెడ్కర్ తెలిపారు. సౌరవ్ లూథ్రా ఈ క్లబ్‌ను రన్ చేస్తున్నట్లు వివరించారు. గతంలోనే క్లబ్ కూల్చివేతకు నోటీసులు కూడా జారీ చేసినట్లు చెప్పారు. కానీ కొంతమంది అధికారులు అడ్డుకున్నట్లు ఆరోపించారు. సౌరవ్ లూథ్రా, గౌరవ్ లూథ్రాపై పోలీసులు కేసు నమోదు చేశారు. క్లబ్ మేనేజర్‌ను చేశారు. యజమానులపై అరెస్టు వారెంట్ జారీ చేశారు.
మృతుల కుటుంబాలకు ప్రధాని సంతాపం
గోవా అగ్ని ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. ఈ ప్రమాదంలో గాయపడినవారు తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. సీఎం ప్రమోద్ ను ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నాను. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉంది. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం అందజేస్తాం’’ అని మోదీ తెలిపారు.
బాధ్యులపై చర్యలు తీసుకుంటాం: సీఎం ప్రమోద్
గోవాలో ఇంతటి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం మొదటిసారి అని సీఎం ప్రమోద్ సావంత్ చెప్పారు. ‘ఫస్ట్ ఫ్లోర్లో మొదట మంటలు అంటుకున్నట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలిసింది. డోర్లు ఇరుకుగా ఉండటంతో ప్రేక్షకులు బయటికెళ్లేందుకు వీలుపడలేదు. అండర్ గ్రౌండ్ ఏరియాకు పరుగులు తీశారు. సరైన వెంటిలేషన్ లేకపోవడంతో ఊపిరి ఆడక ఎక్కువ మంది చనిపోయారు. క్లబ్ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం. ఈ ఘటనపై విచారణకు ఆదేశించా. క్లబ్ నిర్వహణ, భద్రతా ప్రమాణాలపై పూర్తి దర్యాప్తు చేస్తాం’’ అని ప్రమోద్ సావంత్ తెలిపారు.
ఎగ్జిట్ డోర్ ఇరుకుగా ఉండడంతో..
‘బాలీవుడ్ బ్యాంగర్ నైట్’ షోలో భాగంగా షోలే సినిమాలోని ‘మెహబూబా.. ఓ మెహబూబా’ పాటకు ఓ డ్యాన్సర్ బెల్లీ డ్యాన్స్ చేస్తున్నది. వీకెండ్ కావడంతో రద్దీ ఎక్కువగా ఉంది. సంగీత కళాకారులు బ్యాండ్ వాయిస్తుండగా.. ప్రేక్షకులు కేరింతలు కొడుతున్నారు. ఆ టైమ్‌లోనే ఆకస్మికంగా సీలింగ్ నుంచి మంటలు మొదలయ్యాయి. వాటర్ బాటిళ్లతో నీళ్లు పోసినా మంటలు ఆరలేదు. కొన్ని క్షణాల్లోనే మంటలు వేగంగా వ్యాపించాయి. దట్టమైన పొగ కమ్మేయడంతో ప్రేక్షకులంతా ఎగ్జిట్ డోర్ వైపు పరుగులు తీశారు. కానీ.. ఆ డోర్లు చాలా చిన్నగా.. ఇరుకుగా ఉండటంతో.. మరికొంత మంది ప్రాణాలు కాపాడుకునేందుకు కిచెన్‌లోకి వెళ్లి దాక్కున్నారు. తాటాకులతో డెకరేషన్ కారణంగా మంటలు వేగంగా వ్యాపించి ప్రమాద తీవ్రత పెరిగిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.
