ఆఫీసర్ గా చెప్పుకుంటూ డబ్బులు వసూలు..నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

ఆఫీసర్ గా  చెప్పుకుంటూ డబ్బులు వసూలు..నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

మేడిపల్లి, వెలుగు: ప్రభుత్వ శాఖల్లో అధికారిగా చెప్పుకుంటూ ప్రైవేటు దవాఖానలు, విద్యాసంస్థల వద్ద వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్​ చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన మహ్మద్ ఓజియార్ అలియాస్ అర్జున్(36) ఘట్ కేసర్ మండలం కాచవానిసింగారం మణిదీప కాలనీలో నివాసముంటూ ప్రవేట్ జాబ్​ చేస్తున్నాడు. 

కొన్నాళ్ల నుంచి నగరంలోని పలు ప్రైవేట్​విద్యాసంస్థలు, హాస్పిటళ్ల వద్దకు వెళ్లి జీహెచ్ఎంసీ, ఎంహెచ్ఏ, ఫైర్ డిపార్ట్​మెంట్​కు చెందిన అధికారిగా చెప్పుకుంటున్నాడు. అనుమతి పత్రాలు, ఎన్​వోసీ లేవని డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. 

గురువారం మేడిపల్లిలోని ప్రజ్వల హాస్పిటల్​కు వెళ్లి అనుమతి పత్రాలు లేవని డబ్బులు డిమాండ్ చేశాడు. వారు మేడిపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మహ్మద్ ఓజియార్ ను అదుపులోకి తీసుకున్నారు. మెడికల్ అసోసియేషన్ ఉప్పల్ అధ్యక్షుడు డాక్టర్ కె.అశోక్ కుమార్, ప్రతినిధుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు. గతంలో కూడా నిందితుడిపై వివిధ పోలీస్​స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.