శంకర్‌‌దాదా జిందాబాద్‌: బొకేలతో సమస్యలు చెప్తుండు

శంకర్‌‌దాదా జిందాబాద్‌: బొకేలతో సమస్యలు చెప్తుండు

గాంధీగిరి.. చేసిందెవరో!
ఏ సమస్య ఉన్నా దానిపై మహాత్మాగాంధీ చూపించిన దారిలో  శాంతియుతంగా పోరాడటాన్ని, నిరసన తెలియజేయడాన్ని ‘గాంధీగిరి’అంటారు. కొన్నేళ్లక్రితం ‘శంకర్‌‌దాదా జిందాబాద్‌’ సినిమాలో చూపించినట్లుగా ఆ మార్గాన్ని కొందరు పాటిస్తున్నారు. మహారాష్ట్ర లోని థానేలో ఈమధ్య ‘గాంధీగిరి’ మంచి రిజల్ట్‌ ఇచ్చింది కూడా. పట్టణాల్లో మూతలు లేని మ్యాన్‌హోల్స్‌ చాలానే కనిపిస్తుంటాయి. వాటిని అందరూ చూసీచూడనట్లుగా వెళ్లిపోతుంటారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడే వీటిపై గొంతు విప్పుతారు. కానీ, థానే పట్టణానికి చెందిన ఒక వ్యక్తి మాత్రం ఈ సమస్యను ఇలా వదిలేయలేదు. రోడ్‌పై ఫుట్‌పాత్‌మీద మ్యాన్‌హోల్‌ తెరిచి ఉండటం చూశాడు. ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలనుకున్నాడు. ఇందుకోసం ‘గాంధీగిరి’ని పాటించాడు. మ్యాన్‌హోల్‌ ఉన్నచోట అందమైన పూలతో తీర్చిదిద్దిన బొకేను ఉంచాడు. దీన్ని కొందరు ఫొటోలు తీసి, సోషల్‌ మీడియాలో షేర్‌‌ చేశారు. స్థానిక సోషల్‌ యాక్టివిస్ట్‌ డా.బిను కూడా మ్యాన్‌హోల్‌ దగ్గర బొకే ఉన్న ఫొటోను షేర్‌‌ చేశాడు. ఇది వైరల్‌గా మారడంతో, థానే మున్సిపల్‌ అధికారులు కదిలారు. కొన్ని గంటల వ్యవధిలోనే మ్యాన్‌హోల్‌పై మూత ఏర్పాటు చేశారు. పక్కనే ఉన్న ఫుట్‌పాత్‌కు కూడా మరమ్మతులు చేశారు. అయితే, మ్యాన్‌హోల్‌పై బొకే ఉంచి ‘గాంధీగిరి’ని ప్రదర్శించిన ఆ వ్యక్తి ఎవరోమాత్రం తెలియలేదు. ఆ అజ్ఞాతవ్యక్తి ఎవరో కానీ, స్థానికులు అతడికి థాంక్స్‌ చెబుతున్నారు.