
నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. తాగిన మైకంలో మితిమీరిన వేగంతో కారు నడుపుతూ ఓ యువకుడి మరణానికి కారణమైయ్యారు. నాంపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కూకట్ పల్లిలోని ఒక హాస్టల్ లో నలుగురు బ్యాచిలర్ యువకులు ఉంటున్నారు. ఇందులో ఒక యువకుడి పుట్టినరోజు సందర్భంగా... ఫుల్ గా మధ్యం సేవించి కారులో చార్మినార్ కు వెళ్లారు. ఈ క్రమంలో మితిమీరిన వేగంతో వాహనం నడుపుతూ ఒక ఆటో ను బలంగా ఢీకొనడంతో ఆటో పల్టి కొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. అయినప్పటికీ కారును ఆపకుండా వేగంగా పారిపోతుండగా వారిని అజయ్ అనే వ్యక్తి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కానీ అతన్ని కూడా ఢీకొట్టి అతనిపై నుంచి కారును పోనిచ్చారు. ఈ ఘటనలో అజయ్ తీవ్ర రక్తస్రావమై మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు యువకుల్లో ఇద్దరిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలిస్తున్నారు.