పెండ్లి చేస్కుని సెటిల్ అవుదామని రూ.40లక్షలు చోరీ

పెండ్లి చేస్కుని సెటిల్ అవుదామని రూ.40లక్షలు చోరీ
  • స్టీల్​ వ్యాపారి కారుతో డ్రైవర్​ రాజస్థాన్​కు పరార్​ 

బషీర్ బాగ్, వెలుగు:  కారు ఓనర్ ను డ్రైవర్ బురిడీ కొట్టించి రూ. 40 లక్షల నగదుతో పరారైన ఘటన నారాయణగూడ పీఎస్ పరిధిలో జరిగింది. ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ రావు సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. అత్తాపూర్ కు చెందిన వినయ్ కుమార్ గుప్తా స్టీల్ వ్యాపారి. అతని వద్ద రాజస్థాన్ కు చెందిన విజేంద్రసింగ్ ఏడాదిన్నర కిందట కారు డ్రైవర్ గా చేరాడు. 

ఇంటి మనిషిలాగా మెలిగాడు. గత ఫిబ్రవరి 24న వినయ్ కుమార్ గుప్తా రామాంతాపూర్ వెళ్తూ.. దాహం వేయడంతో హైదర్ గూడ నిలోఫర్ కేఫ్ వద్ద కారు ఆపారు. వాటర్ బాటిల్ కొనుగోలు చేసి వచ్చేసరికి డ్రైవర్ విజేంద్రసింగ్ కారుతో పరార్ అయ్యాడు. ఫోన్​ చేస్తే స్విచ్ఛాఫ్ రావడంతో  వినయ్ కుమార్ గుప్తా నారాయణగూడ పోలీసులకు క్లంప్లయింట్ చేశాడు.  కారు తో రూ. 40 లక్షల నగదు ఎత్తికెళ్లినట్లు పేర్కొన్నాడు. 

ప్రత్యేక టీమ్ తో  పోలీసులు రాజస్థాన్  వెళ్లి సెర్చ్ చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా డబ్బులు ఖర్చు అయ్యాయని, ఐపీఎల్ బెట్టింగ్​లో పోగొట్టానని బుకాయించాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు.. చోరీ డబ్బులోంచి రూ. 11 లక్షలు పెట్టి మహేంద్ర స్కార్పియో కొన్నట్లు, మిగిలిన నగదుతో బిజినెస్ పెట్టుకుని సెటిల్ అవ్వాలనుకున్నట్టు అంగీకరించాడు. విజేంద్ర సింగ్ నుంచి రూ. 20 లక్షల 70 వేల నగదు, స్కార్పియోతో పాటు  ఓనర్ వినయ్ కుమార్ కియా సెల్టోస్ కారుతో పాటు రెండు మొబైల్ ఫోన్ల ను సీజ్ చేశారు. 

నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్టు డీసీపీ గిరిధర్ రావు  తెలిపారు.  రాజస్థాన్ వెళ్లి  దొంగను పట్టుకొచ్చిన డీఎస్ఐ వెంకటేశ్ టీమ్ ను అభినందించారు. సుల్తాన్ బజార్ ఏసీపీ శంకర్ , నారాయణగూడ సీఐ చంద్రశేఖర్ , డీఐ నాగార్జున ఉన్నారు.