ఎస్పీ నేతపై షూ విసిరిన యువకుడు.. చితకబాదడంతో పరిస్థితి ఉద్రిక్తం

ఎస్పీ నేతపై షూ విసిరిన యువకుడు.. చితకబాదడంతో పరిస్థితి ఉద్రిక్తం

ఉత్తరప్రదేశ్ లో సమాజ్‌వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్యపై ఒక వ్యక్తి షూ విసరడం ఉద్రిక్తతతకు దారితీసింది. లక్నోలోని ఇందిరాగాంధీ ప్రతిష్ఠాన్‌ వద్ద సోమవారం (ఆగస్టు 21న) జరిగిన ఓబీసీ సమ్మేళన్‌లో మౌర్య మాట్లాడుతుండగా.. లాయర్ దుస్తుల్లో వచ్చిన ఆకాష్ సైనీ అనే యువకుడు మౌర్యపై షూ విసిరాడు. దీంతో వెంటనే మౌర్య మద్దతుదారులు మూకుమ్మడిగా అతనిపై దాడి చేశారు.

స్వామి ప్రసాద్ మౌర్య జిందాబాద్ అని నినాదాలు చేస్తూనే షూ విసిరిన వ్యక్తిపై దాడి చేయడంతో అతను అక్కడికక్కడే సొమ్మసిల్లి పడిపోయాడు. దాడిని నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ మౌర్య మద్దతుదారులు వెనక్కి తగ్గలేదు. 

ఎస్పీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్ కూడా సమావేశానికి వచ్చి ప్రసంగించాల్సి ఉంది. అంతకు ముందు ఎస్పీ నేత స్వామి ప్రసాద్ మౌర్య సభను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఇంతలో కార్యకర్తల గుంపు నుంచి ఓ షూ శరవేగంగా మౌర్య వైపు దూసుకొచ్చింది. క్షణాల్లో దాన్నుంచి మౌర్య తప్పించుకున్నారు. అయితే.. షూ విసిరిన వ్యక్తిని పట్టుకున్న కార్యకర్తలు అతన్ని చితక్కొట్టారు. 

ఎస్పీ కార్యకర్తల దాడిలో గాయపడ్డ నిందితుడిని అదుపులోకి తీసుకున్న విభూతి ఖండ్ పోలీసులు.. ఆస్పత్రికి తరలించారు. అతడిని విచారించిన తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (లక్నో) అనియాండీ విక్రమ్ సింగ్ తెలిపారు.  మరోవైపు తమ పార్టీ నేతలపై ఇలాంటి చర్యలను ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ ఖండించారు.