
శంషాబాద్: హైదరాబాద్ నగర శివారులోని శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉట్పల్లి గ్రామంలో ఒక వ్యక్తి కారులో చనిపోయి కనిపించిన ఘటన కలకలం రేపింది. ఈ వ్యక్తి పేరు గణపతి అని, వయసు 60 సంవత్సరాలు ఉంటుందని తెలిసింది. గణపతి ప్రతిరోజు మందుకు బానిసై విపరీతమైన మందు తాగేవాడని స్థానికులు తెలిపారు. గణపతి స్వస్థలం కర్ణాటకలోని బెంగళూరు నగరం అని, అయితే గత ఐదు సంవత్సరాల నుంచి ఉట్పల్లిలో ఒక ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నాడు.
గత రాత్రి మద్యం విపరీతంగా త్రాగి కారులో తిరుగుతూ కనిపించాడని, ఆదివారం ఉదయం ఒక ఫుల్ బాటిల్ మందు సేవించి కారులో ఊపిరి ఆడక చనిపోయాడని ఉట్పల్లి గ్రామస్తులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు డెడ్ బాడీని ఉస్మానియా హాస్పిటల్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిళ్ల కారణంగా కొందరు వృద్ధాప్యంలో మద్యానికి బానిసలుగా మారుతున్నారు. ఫలితంగా ఇలా జీవితాలను అర్థాంతరంగా ముగించేస్తున్నారు. తాగిన మైకంలో అనేక మంది కుటుంబాలు ఛిద్రమవుతున్నాయి.
కొందరు ఆత్మహత్యలు చేసుకుంటుండగా, మరికొందరి మైకంలో సొంతవారినే చంపుతున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం ఏదో మూలన జరుగుతూనే ఉన్నాయి. గతంలో గ్రామాల్లో గుడుంబా, సారా ప్రభావం విపరీతంగా ఉండేది. కొంతకాలంగా వాటి విక్రయాలు తగ్గినా అదే స్థాయిలో లిక్కర్ వినియోగం పెరిగింది. ఊర్లలో తాగుడుకు అలవాటుపడ్డవాళ్లు సంపాదనంతా దానికే పెడుతున్నారు. ఆ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. మరోవైపు తాగుడుకు అలవాటైన వాళ్ల ఆరోగ్యం దెబ్బతింటోంది. ట్రీట్మెంట్ కోసం అప్పులు చేస్తున్నారు. చివరికి ప్రాణాలు వదులుతున్నారు. దీంతో కుటుంబ భారం మహిళలపై పడుతోంది.