ఒకప్పుడు ఇంట్లో వండటం కుదరకపోతే బయట తిందాంలే అనుకునే మధ్యతరగతి జీవి.. ఇప్పుడు హోటల్ మెట్లు ఎక్కాలంటేనే జేబులు తడుముకోవాల్సిన పరిస్థితి వస్తోంది. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు, నిత్యావసరాల మంటలతో ఇప్పటికే సగం చచ్చిన సామాన్యుడిపై.. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం మరో పిడుగులా పడింది. బయటకెళ్లి ఒక ముద్ద తిని బతుకుదాం అనే మధ్యతరగతి ఆశలపై ఓ నిర్ణయం కుంపటిలా మారిపోయింది. ఇప్పటికే గ్యాస్, పెట్రోల్ రేట్ల పెంపుతో ధరలు పెంచిన హోటళ్లు ప్రభుత్వ నిర్ణయంతో మరోసారి వడ్డనకు సిద్ధం అవుతున్నాయి.
వివరాల్లోకి వెళితే.. కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కార్మికుల కనీస వేతనాలను భారీగా పెంచుతూ మే 22న నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయం బెంగళూరుతో పాటు కర్ణాటకలోని హోటల్ యాజమాన్యాలకు పెద్ద షాక్ గా మారింది. పెరిగిన ఈ వేతనాల భారాన్ని తాము మోయలేమని.. ఖచ్చితంగా ఆ భారాన్ని కస్టమర్లపైనే వేస్తామని హోటల్ అసోసియేషన్లు తెగేసి చెబుతున్నాయి. దీంతో రానున్న రోజుల్లో హోటల్ తిండి ధరలు ఏకంగా 60 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నాయి.
కర్ణాటక స్టేట్ హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి.కె. శెట్టి ఈ ధరల పెంపు ఎలా ఉండబోతోందో లెక్కలతో సహా వివరించారు. ప్రభుత్వం సూచించిన కొత్త వేతనాల రూల్స్ అమలులోకి వస్తే.. ప్రస్తుతం రూ.80కి దొరికే మసాలా దోశ రేటు ఏకంగా రూ.150 కి చేరుకుంటుందన్నారు. సామాన్యుడు కడుపునిండా తినే వెజిటేరియన్ మీల్స్ ధర రూ.150-200 నుండి ఏకంగా రూ.250-300 కి పెరుగుతుందట. ఇక ఆదివారం వస్తే మధ్యతరగతి ఇష్టంగా తినే బిర్యానీ ధర రూ.350 నుండి ఏకంగా రూ.500 తాకుతుందని లెక్కలు వివరించారు. చివరకు పేదవాడి టిఫిన్ అయిన ఒక ప్లేట్ ఇడ్లీ ధర కూడా ప్రస్తుతం ఉన్న రూ.50 నుండి రూ.80 అవ్వటం పక్కా అని చెప్పారు.
రాష్ట్రంలో దాదాపు 60 వేల హోటళ్లు ఉండగా.. ప్రభుత్వం కొత్త విధానంలో కార్మికులను నైపుణ్యం ఆధారంగా నాలుగు వర్గాలుగా విభజించింది. బెంగళూరు లాంటి జోన్-1 పరిధిలో నైపుణ్యం లేని సాధారణ కార్మికుడి కనీస నెలవారీ వేతనాన్ని రూ.19వేల నుండి రూ.23వేల 376కి పెంచారు. సెమీ-స్కిల్డ్‌కు రూ.25వేల 714, స్కిల్డ్ వర్కర్‌కు రూ.28వేల 285, అలాగే హైలీ స్కిల్డ్ వర్కర్‌కు రూ.31వేల 114 గా వేతనాలు ఖరారు చేశారు.
ప్రభుత్వం జీతం రూ.23వేల 376 గా నిర్ణయిస్తే.. ఈఎస్‌ఐ, పీఎఫ్ లతో పాటు వారికి ఇచ్చే ఉచిత వసతి, భోజనం అన్నీ కలుపుకుని హోటల్ యజమానికి ఒక్కో వర్కర్ మీద నెలకు రూ.36వేల వరకు ఖర్చవుతుందన్నారు బృహత్ బెంగళూరు హోటల్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి.సి. రావు. ఇప్పటికే కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర కేవలం కొన్ని నెలల్లోనే రూ.3వేల152కి పెరగగా.. మరోవైపు సోనా మసూరి బియ్యం కేజీపై రూ.5, జీరా రైస్ కేజీపై రూ.10 పెరిగాయని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో రేట్లు పెంచడం మినహా తమకు వేరే దారి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
హోటల్ రంగం ఇతర పరిశ్రమల లాంటిది కాదని.. ఇక్కడ కార్మికులకు జీతంతో పాటు తిండి, బట్టలు, వసతి కూడా హోటల్ యజమానులే చూసుకుంటారని.. ఈ వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా కర్ణాటక ప్రభుత్వం జీతాలు పెంచిందని వాపోతున్నారు. మొత్తానికి ప్రభుత్వ నిర్ణయం కార్మికులకు మేలు చేసినట్లు కనిపిస్తున్నా.. దాని వల్ల హోటల్ ఫుడ్ కాస్ట్ పెరిగి.. చివరికి మధ్యతరగతి ప్రజల జేబులకే చిల్లు పడనుంది.
